బ్యాంకు లాకర్లలో లక్షలున్నా
తరతరాలకు తరగని,కోట్లకొద్దీ ఆస్తులున్నా
లెక్కపెట్టలేనన్ని డబ్బులసంచులు
ప్రక్కనే వున్నా, బ్లడ్ బ్యాంకు,
మినీ హాస్పటల్ ఇంట్లోనే వున్నా
ఎంతటి ధనవంతులైనా, దరిద్రులైనా కోటీశ్వరులైనా,కూటికిలేని నిరుపేదలైనా
ఆ కరోనా రక్కసి ముందర అందరూ ఒక్కటే
కన్న బిడ్డలున్నా,
కట్టుకున్న భార్యలున్నా
బంధువులెందరున్నా,
కోట్లమంది అభిమానులున్నా
కరోనా సోకితే అందరూ
ఆమడదూరమే,ఆపై పారిపోవడమే
ఆశతో ఆసుపత్రిలో చేరితే,
మాటువేసి కరోనా కాలసర్పం
తమను కాటు వేస్తుందని తెలిసినా
ముద్దు పెట్టుకునేందుకు కరోనా మృత్యువు
ముందరే సిద్దంగా వుందని తెలిసినా
లెక్కచేయకుండా, ప్రాణాలను ఫణంగా పెట్టి
అంటరాని కరోనా రోగులవెంటే తిరుగుతూ
వారిని ముట్టుకొని, ప్రేమతో పట్టుకొని,
కడుపులో పెట్టుకొని,కంటికిరెప్పలా కాపాడి
నిద్రాహారాలు మాని నిస్వార్థంగా సేవలుచేసే
దైవస్వరూపులైన,ఆ డాక్టర్లకు, నర్సులకు
ఏమిచ్చి మనం వారి ఋణం తీర్చుకోగలం?
ప్రాణదాతలైన ఆ డాక్టర్ల, నర్సుల
పాదపద్మములకు ప్రణమిల్లడం తప్ప
కనిపించే ఈ దేవుళ్ళను
కరోనా రక్కసి బారిన పడకుండా కాపాడమని
ఆ ముక్కోటి దేవతలకు మ్రొక్కడం తప్ప
వారినీ వారి కుటుంబసభ్యులందరు
నిండూనూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని దీవించడం తప్ప
రండి రెండు చేతులు జోడించి ,శిరసువంచి
ఈ ప్రాణదాతలకు ఈ మదర్ థెరిస్సాలకు
చేద్దాం రండి అందరం వందనం ! పాదాభివందనం



