Facebook Twitter
వలస కార్మికుల కన్నీటి వ్యధలు..

చదువుసంధ్యలులేక 

చేతిలోపనులు లేక

పొట్టగడిచే దారిలేక

జబ్బుచేసి కాటికి సిద్దమైనా

చావురాని ముసలివాళ్ళను

ఇళ్ళదగ్గరే వదిలివేసి

 

పొట్టచేతపట్టుకొని

కూలి పనికోసం, 

ఎన్నో వేలమైళ్ళదూరం

ఎంతో ఆశతో వచ్చాము

మేము బీదవాళ్ళమేకాని

బిక్షగాళ్ళము కాదూ సారూ

గరీబోళ్ళం కూలినాలిచేసుకోని

ఇంతగంజైనా తాగుతాం కాని అడుక్కోం

 

దుర్గంధాన్ని భరించలేని,

గాలి ఆడని,ఎక్కువ

అద్దె ఇచ్చుకోలేని,ఇరుకు ఇళ్ళల్లో 

పూరి గుడిసెల్లోవుంటూ

కూలినాలిచేసుకుంటూ

చాలీచాలని ఆదాయంతో

మేము తిన్నాతినక పోయినా

ఊళ్ళోవుండే అమ్మానాన్నలకు

అప్పులోళ్ళకు డబ్బులు పంపుతాము

 

ఇక్కడైనా అక్కడైనా 

ఎక్కడైనా ఎవరికైనా జబ్బుచేస్తే

అప్పుచేసి ఆసుపత్రిలో చుట్టు తిరుగుతాం

ఆపరేషన్లు చేయించుకోలేక 

ఐనా వాళ్ళెందరినో వదులుకున్నాం

 

మా కడుపు కొట్టే వారే కాని

మమ్ము వాడుకునే వారేకాని

మమ్ము ఆదుకునే వారే లేరు

మేమక్కడి వారమో,ఇక్కడివారమో

అర్థం కాదు,కాని ఇద్దరికీ భారమే

 

మా కన్నతల్లేమో దూరంగా వుంది

ఈ సవతి తల్లేమో

చిత్రహింసలు పెడుతుంది

ఉపాధి లేక ఊరెళ్ళలేక

కడుపునిండా తిండి లేక

చావలేక చావురాక 

బతకలేక బతుకుతున్నాం

 

ఇంటి మీద మనసుపడిందీ

సొంత వూరు పోవాలని బెంగ పట్టుకుంది

మాటిమాటికీ మావాళ్ళు గుర్తువస్తే

గుండె పగిలి పోతుంది

ఐనవాళ్ళ అండన వుండాలని

వారికి అండగా వుండాలని ఆశగావుంది

 

అందుకే ఎలాగైనా సరే

ఎన్ని వేలకిలోమీటర్ల

దూరమైనా సరే ఎన్నిరోజులైనా సరే

తిండిలేకున్నా సరే పంపు నీళ్ళతోనైనా

కడుపు నింపుకుంటూ పోతాము

కళ్ళుతిరుగుతున్నా సరే ఆకలికి 

కడుపు మలమలమాడుతున్నా సరే

కాళ్ళకు బొబ్బలెక్కుతున్నాసరే

 

పోతే ప్రమాదమని తెలిసినా 

చాటుమాటుగా కరోనా కాటేస్తదని 

తెలిసినా, భయపడక, బాధలేక

ఎర్రని ఎండల్లో పిల్లాపాపలతో 

రోడ్ల వెంటా రైలు పట్టాలు వెంట

ఆశతో కొండంత ఆశతో

గుండెనిండా నిబ్బరంతో

ఏడ్చుకుంటూ,కాళ్ళీడ్చుకుంటూ

నడుచుకుంటూ పోతాము

అదృష్టం బాగుంటే ఇళ్ళు చేరతాం

ఖర్మకాలితే మేము కాటికి చేరతాం

 

మా నడక మాత్రం ఆగదు

మా ఆశ మాత్రం చావదు

మేము దార్లో చచ్చిశవాలైనా పర్వాలేదు

మేము మాత్రం ఉరెళ్లిపోతాం మా ఉరెళ్లిపోతాం

మమ్ము ఎల్లనియ్యండి సారూ మీకాళ్ళుమొక్కుతాం...