Facebook Twitter
సినారె...ఎవరిని అడిగితే నేనేమని చెప్పేది?

బహుముఖ ప్రజ్ఞాశాలి...
తెలుగు సాహితీ క్షేత్రంలో
అలసిపోని తోటమాలి
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత...

విశ్వకవి రవీంద్రుడు
విశ్వనాథ సత్యనారాయణ
వివేకానందుని విశిష్ట లక్షణాల
విశాలమైన అభ్యుదయ భావాల
అలుపెరుగని సాహితీ కృషీవలుడు...
సినారే...ఎవరని అడిగితే నేనేమని చెప్పేది.

సినీ గేయకవి సినారె
భావ గాంభీర్యం...
శబ్ద మాధుర్యం అమోఘం...
వారు వ్రాసిన ప్రతిపాట ఓ పంచామృతం...

తెలుగు భాషా వికాసానికి
సాహిత్యంలోని అనేక ప్రక్రియలో
రచనలు చేసి రాణించి..
నన్ను దోచుకుందువటే
వన్నెల దొరసాని...అంటూ
గులేబకావళి చిత్రంలో
శ్రీకారం చుట్టి 3500 గీతాలు వ్రాసి
సినీ జగత్తులో సంచలనం సృష్టించి
ప్రేక్షకుల హృదయాలను దోచిన...
సినారే...ఎవరిని అడిగితే నేనేమని చెప్పేది?

మట్టిలో మాణిక్యం...
పల్లెలో పుట్టి
పరిమళించిన
పారిజాత పుష్పం...
తెలుగు తల్లి మెడలో
మెరిసే ముత్యాల హారం...

అద్భుతమైన
అపురూపమైన
అద్వితీయమైన
85 బృహత్ గ్రంథాలను
ఆవిష్కరించిన అక్షర శిల్పి...
సినారె...ఎవరిని అడిగితే నేనేమని చెప్పేది?

నాడు ఆంధ్రరాష్ట్రంలో
అనేకమైన ఉన్నత
పదవులను నిర్వహించి
ఆ పదవులకే వన్నె తెచ్చిన
అనేక విశ్వవిద్యాలయాల
డాక్టరేట్లు ప్రతిష్టాత్మకమైన
పద్మశ్రీ ...పద్మభూషణ్
అవార్డులు పురస్కారాలు సినారేను
వరించాయి...వరించి....తరించాయి

యుగోస్లేవియాలో జరిగిన
ప్రపంచ కవి సమ్మేళనంలో
పాల్గొన్న విశ్వనరుడు
విశ్వకవి విశ్వంభరుడు 
సినారె...ఎవరని అడిగితే నేనేమని చెప్పేది.

సినారె ఎవరంటే...?
సినారె ఒక గొప్ప వక్త...
సినారే ఒక సాహితీ ప్రవక్త...
సినారే ఒక రవి కిరణం...
సినారె ఒక సాహితీ శిఖరం...
సినారె ఎవరంటే...?
సినారే "మరణం లేని ఒక మహాకవి"..!