Facebook Twitter
బంగారు తల్లి భారతీ..!

ప్రతి మగాడి విజయం వెనుక
ఒక మహిళ తప్పక ఉంటుంది
అంటారు మన పెద్దలు అనుభవగ్నులు

కానీ నిన్న సీన్ రివర్స్...
పూరి గుడిసెలో‌ పుట్టిన పులిబిడ్డ
మన చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి...
ఆమె ధైర్యం పులి ధైర్యం
ఆమె సహనం భూదేవి అంత
ఆమె ఆశయం ఎవరెస్టు అంత

పచ్చగడ్డి తెస్తూ రోజు
పశువులను మేపుకుంటూ
పొలంలో కూలీ పనులకెళ్తూ
పచ్చడి మెతుకులు తింటూ 
అవి దొరకనినాడు పస్తులుంటూ
ఆకలికి తాళలేక కొన్ని రాతృలు
కన్నీళ్ళతో కడుపు నింపుకుంటూ
రేయింబవళ్ళు రెక్కల్ ముక్కల్ చేస్తూ
ఏ వసతులు లేని పచ్చి పల్లెటూరిలో
అతి సాదాసీదాగా...
ఎవరినుండి ఏ సహాయం
ఆసించక అర్థించక ఆత్మ గౌరవంతో
కొండంత ఆత్మ విశ్వాసంతో
నిరుపేద బ్రతుకు బ్రతుకే
భార్య సాలే భారతిని
అతి క్లిష్టమైన
రసాయన శాస్త్రంలో (కెమిస్ట్రీ)
ఏడేళ్ళు చదివించిన
భర్త శివప్రసాద్
కృషి కసి పట్టదల త్యాగం
భార్య పై ఉన్న గట్టి నమ్మకం
కురిపించిన ప్రేమ వెలకట్టలేనిది

తన భార్య
ఒక బిడ్డకు తల్లి
గవర్నర్ చేతులమీదుగా
శ్రీకృష్ణ దేవరాయల
విశ్వవిద్యాలయంలో
గైడ్ శోభ గారి పర్యవేక్షణలో
పీ హెచ్ డి పట్టా పుచ్చుకునేందుకు...
చిరిగిన చేనేత చీర కట్టుకుని
కాళ్ళకు పారగాన్ చెప్పులు తొడుక్కుని
"స్టేజీ ఎక్కింది" కాదు కాదు
ఆమె "ఎవరెస్టు శిఖరం" ఎక్కింది
ఆమెకు "పి హెచ్ డి పట్టా" దక్కింది
అప్పుడు ఆ వేదిక కరతాళ
ధ్వనులతో మారుమ్రోగిపోయింది
శ్రమయేవ జయతే కష్టే ఫలి
అన్న నినాదాలను ప్రతిరూపం
మన చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి...

రేషన్ బియ్యపూ గంజి.....బ్రేక్ ఫాస్ట్
కారం మెతుకులు...మధ్యాహ్నం లంచ్

కూలీనాలీ చేసుకుంటూ చ‌దువుకున్నా..

ఇప్పుడు గ‌ర్వంగా పీహెచ్‌డీ సాధించిన.
ఈ చ‌దువుల త‌ల్లికి స‌లాం కొట్టాల్సిందే...
   
ఆమె..మ‌ట్టిలో మాణిక్యం
కూలీ ప‌నికి వెళ్తే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి.

ఆర్థిక స‌మ‌స్య‌లెన్నున్నా అడుగు ముందుకే

పదవ తరగతిలో పెళ్లి త‌ర్వాత త‌ల్లి
ఐనా చేయ‌లేదు చ‌దువును నిర్ల‌క్ష్యం
పీహెచ్‌డీ పట్టాయే దానికి ప్రత్యక్షసాక్ష్యం
ఇప్పుడ కూలీ భార‌తి కాదు...డాక్ట‌ర్ భార‌తి

లక్ష్యసాధనకు
అడ్డంకి కాదు పేదరికం...
28 కి.మీ. దూరంలో కాలేజీ
ఆటోకి డబ్బు లేక
ఎనిమిది కిలోమీటర్లు...నడక
20 కి. మీ బస్ ప్రయాణం

భారతి ప్ర‌తిభ‌ను చూసిన 
పీహెచ్‌డీ చేయాల‌ని టీచర్ల సలహా 
ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర
‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధన

దినసరి కూలీగా...
ఎండనకా, వాననకా చెమటోడ్చింది.
ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో... రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది.

స్నాతకోత్సవంలో....
పీహెచ్‌డీ పట్టాను అందుకునేందుకు
పారగాన్‌ చెప్పులతో...సాదాచీరలో
వచ్చిన భారతి ఆహార్యం
వేదికకొక కొత్త వెలుగును తెచ్చింది

పేదరికం లక్ష్యసాధనకు
పేదరికంఅడ్డంకి కాదని
రుజువు చేస్తూ నడిచొచ్చిన
ఆ చదువుల సరస్వతిని చూసి
అతిథులంతా ఆశ్చర్యచకితులైపోయారు