Facebook Twitter
జ్ఞానదేవత డాక్టర్ సాకే భారతికి అక్షరాభిషేకం…

డాక్టర్ సాకె భారతి...
ఎరుకల కులంలో పుడితేనేమి...?
ఆమె‌ ఎవరెస్టు శిఖరం ఎక్కింది...!
ఆమెకు పి హెచ్ డి పట్టా దక్కింది..!

తినడానికి తిండి...
కట్టుకోవడానికి బట్టలు...
కాలికి చెప్పులు...
కప్పుకోవడానికి దుప్పటి...
పడుకోవడానికి మంచం...
ఉండడానికి ఇల్లేలేని...
ఒక బిడ్డకు తల్లిగా...
ఒక దినసరి కూలీగా...
ఎర్రని ఎండలో...జోరు వానలో
8 కి.మీ కాలినడకన వెళ్లి...

పదవ తరగతి...ఇంటర్మీడియట్
డిగ్రీ...పీజీ...ఏడు సంవత్సరాలు
కసితో కృషితో గట్టిపట్టుదలతో చదివి...
గైడ్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ పర్యవేక్షణలో...
అతి క్లిష్టమైన రసాయనశాస్త్రంలో
"ది స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్"అను
అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించి
శ్రీ కృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయంలో
గవర్నర్ చేతులమీదుగా...
ఒక "పి హెచ్ డి" పట్టాను
అందుకోవడానికి...ముందు

ఆమె ఎన్ని నిద్రలేని
రాత్రుల్ని గడిపిందో...
ఎన్ని కన్నీళ్ళను
దిగమింగిందో...
ఎన్ని అవమానాలు....
ఎన్ని అష్టకష్టాలు పడిందో...
ఎన్ని బాధలు భరించిందో...
ఎందరు ఎంతగా
ఎగతాళి చేశారో ...
మానసికంగా ఆమెను
ఎంతగా వేధించారో...
మన ఊహలకు అందదు...

ఒక ముతక చీర కట్టుకొని...
పారగాన్ చెప్పులు తొడుక్కుని...
ముఖానికి పౌడరైనా రాసుకోకుండా...
మహా మేధావులున్న వేదిక నెక్కి
గవర్నర్ చేతులమీదుగా...
అతి క్లిష్టమైన రసాయనశాస్త్రంలో
"డాక్టరేట్ పట్టాను" పొందిన
ఆ శ్రమజీవికి...ఆ జ్ఞాన సరస్వతికి...
ఆ సావిత్రి భాయి పూలేె వారసురాలికి...
ఆ చదువులతల్లికి అక్షరాభిషేకం చేయడం
మన తెలుగు జాతికి గర్వకారణం...
ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకం...