Facebook Twitter
అమరజీవికి అశ్రునివాళి…

పుణ్యదంపతులైన

శ్రీ గురవయ్య మహాలక్ష్మమ్మల

గర్భాన మద్రాసులో జనియించి

బొంబాయిలో విద్యనార్జించి...

 

నవయవ్వనంలోనే

పిన్న వయసులోనే

పుట్టిన బిడ్డను కోల్పోయినా

కట్టుకున్న భార్య కన్నుమూసినా

మిన్ను విరిగి మీదపడినా

సమస్యల పిడుగులవర్షం కురిసినా

 

వెరవక వెన్ను చూపక కలత చెందక

కారుచీకట్లో కూర్చొని కన్నీరు కార్చక

కరుణ దయలేదని కర్త కర్మ క్రియయైన 

ఆ పరమాత్మను నిందించక

 

కమ్మని కలలు కన్నాడు

ఊరికి దూరంగా ఉన్న

అభాగ్యులందరికీ

ఆలయప్రవేశం జరగాలని...

ఆంధ్రుల చిరకాల స్వప్నమైన 

ఆంధ్రరాష్ట్రం అవతరించాలని...

 

కులమతాలకతీతంగా

అందరిఇంట భోజనం చేస్తూ

సత్యం ప్రేమ అహింసలనే

ఆయుధాలుగా ధరించి  

గాంధీజీ ఆశయాలకే అంకితమై

 

అడుగునున్న బడుగుల ఉద్దరణకు...

ఆంధ్రరాష్ట్ర అవతరణకు...

అహర్నిశలు కృషిచేసినా 58 రోజులు 

ఆమరణ నిరాహారదీక్ష చేసినా

ప్రభంజనమై ప్రజలు మద్దతిచ్చినా

 

ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్పందించక

ప్రాణబిక్ష ‌పెట్టేవారులేక

నిమ్మరసమిచ్చి నిరాహారదీక్షను 

విరమింపజేసేవారే కరువై కన్నుమూసిన

ఆంధ్రరాష్ట్ర సాధనకోసం అమరుడవైన

ఓ శ్రీ పొట్టిశ్రీరాములయ్యా మీకు వందనం...అభివందనం...పాదాభివందనం

తెలుగువారి గుండెలే మీకు సింహాసనం

మీరు చిరంజీవులు చిరస్మరణీయులు

మీ కీర్తి అజరామరం అది ఆచంద్రతారార్కం