Facebook Twitter
ఆర్మీ చీఫ్… బిపిన్ రావత్...అస్తమయం

1...
ప్రక్కలో బల్లెమైన పాక్ కు
కంటిలో కారంలా
గుంటనక్కచైనాకు
గుండెల్లో గునపంలా
వ్యూహాత్మక సర్జికల్ ‌స్ర్టైక్ లతో
శతృదేశాలకు గుబులు పుట్టించిన
తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ బాటనే
నడిచి సైన్యంలో చేరి
అంచెలంచెలుగా
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదిగిన
అఖండ భారతావనిలోనే అత్యంత
ప్రతిభావంతుడు శక్తిమంతుడైన
సైన్యాధ్యక్షుడు అసలైన దేశభక్తుడు
18 ఉత్తమ విశిష్ట అతి విశిష్ట యుద్దసేవా
మెడల్స్...సొంతం చేసుకున్న...మన
త్రిదళాధిపతి...ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
ఇకలేరని తెలిసి... ఎదపైనున్న ఆ ఫోర్ స్టార్లు...
ఆ నాలుగు నక్షత్రాలు బోరుబోరున విలపిస్తున్నాయి
కన్నీరుమున్నీరౌతున్నాయి ఇది కలయా నిజమా అని...

2...
తన చివరి రక్తపుబొట్టు వరకు
దేశరక్షణే తన లక్ష్యమని జీవితాన్ని
భరతమాత పాదపద్మాలకే అంకితం చేసి
తమంత ఎత్తుకు ఎదిగిన...మన
త్రిదళాధిపతి...ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
అస్తమించారని తెలిసి...ఆ ఎవరెస్టు శిఖరాలు...
వెక్కివెక్కి ఏడుస్తున్నాయి
కన్నీరుమున్నీరౌతున్నాయి ఇది కలయా నిజమా అని...

3...
ఆయన పిడికిలి బిగిస్తే ఫిరంగులమ్రోతే...
ఆయన కనుసైగ చేస్తే
శతృస్థావరాల్లో యుద్దవిమానాల కవాతే...
తన ధైర్యసాహసాలతో ధీరత్వంతో శౌర్యంతో
తీవ్రవాదుల దురాక్రమణదారుల
గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన
శతృ దేశాలకు చుక్కలు చూపించిన
మిత్రదేశాలకు అభయహస్తాన్నందించిన
అంకితభావంతో అసమాన ప్రతిభాపాటవాలతో
63 సంవత్సరాల జీవితంలో
43 సంవత్సరాలు దేశరక్షణకే త్యాగం చేసిన
ఘనుడు త్యాగధనుడు
సైన్యంలో భారీసంస్కరణలకు ఆద్యుడు ఆరాధ్యుడు
మన త్రిదళాధిపతి...ఆర్మీ చీఫ్ ‌జనరల్ బిపిన్ రావత్
పార్థివ దేహాంపై కప్పిన...ఆ త్రివర్ణపతాకం...
కన్నీరుమున్నీరౌతోంది ఇది కలయా నిజమా అని...

4...
శతృదేశాలకు సింహస్వప్నమై
పాక్‌ చైనా మయన్మార్ లు పెంచిపోషించే
తీవ్రవాదుల్ని వేర్పాటు వాదుల్ని
దురాక్రమణ దారుల్ని ముష్కర మూకల్ని
మట్టుబెట్టి నిత్యం తన నుదుట రక్తతిలకాన్ని దిద్దే
వ్యూహకర్త...బహుముఖ ప్రజ్ఞాశాలి...తన ముద్దుబిడ్డ...
త్రిదళాధిపతి...ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ను
కౄరంగా...అతిదారుణంగా...ఆ మృత్యువు 
కబళించినందుకు ఆ కన్నతల్లి భరతమాత...
కన్నీరుమున్నీరౌతోంది ఇది కలయా నిజమా అని...

5...
ఔను 2015 ఫిబ్రవరి 3 న నాగాలాండ్ లో
కుప్పకూలిన హెలికాప్టర్ నుండి రెప్పపాటులో
తప్పించుకొని మృత్యుంజయుడైన మన
త్రిదళాధిపతి...ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
మరో 5 నిముషాల్లో తాను చదివిన వెల్లింగ్టన్
డిఫెన్స్ కాలేజీ‌లో లెక్చర్ ఇవ్వవలసివుండగా...

తన సతీమణి మధులికా రావత్ తో 
మరో 12 మంది సైనికాధికారులతో కలిసి
ప్రయాణిస్తున్న అత్యంత సురక్షితమైన
MI -17 వీ 5 హెలికాప్టర్...విధి వక్రించి
ఒక్కసారిగా తమిళనాడు నీలగిరి కొండల్లో
కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది
మంటలు చెలరేగి 13 మంది మన వీరజవాన్ల
ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి
ఈ దుర్వార్తను విన్న 130 కోట్లమంది భారతీయులు
కన్నీరుమున్నీరౌతున్నారు ఇది కలయా నిజమా అని...

6...
ఔను ఇది నిజమే నమ్మలేని నగ్నసత్యమే...
ఈ డిసెంబర్ 8...
భరతమాత గుండెలు బ్రద్దలైనరోజు...
ఆ మృత్యువెంత కౄరమైనదో తెలిసినరోజు...
యావత్ భారతావనికి ఒక్కక్షణం ఊపిరాగినరోజు...
మన త్రిదళాధిపతి...
సర్వసైన్యాధ్యక్షుడు...
భరతమాత ముద్దుబిడ్డ...
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
నీలగిరి కొండల్లో నిద్రపోయిరోజు...
అదిగో అటు చూడండి
నీలగిరి కొండలు నిట్టూరుస్తున్నాయ్
హే రామ్ ఈ నేరం మాదికాదు ఆ విధాతదంటూ
హెలీకాప్టర్లు వెక్కివెక్కి ఏడుస్తున్నాయ్
యుద్దవిమానాలు శతఘ్నులు విలపిస్తున్నాయ్
మంచుకొండలు మరఫిరంగులు మౌనంగా రోదిస్తున్నాయ్
సప్తసముద్రాలు ఘోషిస్తున్నాయ్ ఔరా ఏమిటీ ఘోరమని...



7....
ఔనీవేళ...
భరతజాతి...
భారత సైన్యం...
రాష్ట్రపతి ప్రధాని రక్షణశాఖ మంత్రి...
ఇద్దరు ముద్దుల కూతుళ్ళు కృతిక తారిణిలు
రక్తసిక్తమైన ఆ రక్షణ కవచాలకు...
రాలిపోయిన ఆ వీరకుసుమాలకు...
నీలగిరి కొండల్లో అస్తమించిన
ఆ భాస్కరులకు...
ఆ యుద్దవీరులకు ఆ విక్రమార్కులకు...
ఆ పోరాటయోధులకు ఆ దేశభక్తులకు...
చేతులెత్తి మ్రొక్కుతూ... సెల్యూట్ చేస్తూ...
అమర్ రహే అమర్ రహే... బిపిన్ రావత్ అమర్ రహే
అమర్ రహే అమర్ రహే... మన వీరజవాన్లు అమర్ రహే
అంటూ దిక్కులు పిక్కటిల్లే  నినదిస్తూ...
పగిలిన గుండెలతో ...
విషన్న వదనాలతో...వీడ్కోలు పలుకుతూ...
అశృనయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు
కన్నీరుమున్నీరౌతున్నారు ఇది కలయా నిజమా అని...

ఔను ఇది నిజమే...విధి విజయమే...
శతృవులనెందరినో జయించి
మృత్యువు చేతిలో ఓడిపోయిన
ఆ 13 మందిఅమరవీరుల ఆత్మలకు
శాంతి చేకూరాలని కోరుకుంటూ
అశృనయనాలతో అందిస్తున్న
అక్షర నీరాజనం....