Facebook Twitter
చదువులతల్లి…డాక్టర్ సాకే భారతికి...అక్షర హారతి..!

ప్రతిమగాడి...విజయం వెనుక
ఒక మహిళ ఉంటుందన్నది
...ఒకనాటి పెద్దల మాట...

భార్య...సాకే భారతి
పీహెచ్ డీ పట్టా వెనుక
తాత...సుంకన్న
భర్త...శివప్రసాద్ ఉన్నారన్నది...
...నేడు వైరలౌతున్న వార్త...

బస్...ఆటో ఏ సౌకర్యాలు లేని
ఒక మారుమూల గ్రామంలో...
పచ్చడి మెతుకులతో...
ఆ మెతుకులే లేకుంటే...
కన్నీళ్ళతో...మంచినీళ్ళతో...
కడుపులు...నింపుకొని
పస్తులు పడుకునే...
ఒక నిరుపేద కుటుంబంలో...
ఒకే కిడ్నీతో ఒక పూరిగుడిశెలో పుట్టి...

భూదేవంత సహనంతో...
ఆకాశమంతా ఆశయంతో...
నిరంతరం కసితో కృషితో...
ఎవరినుండి ఏదీ ఆశించని...
చదువేతప్ప మరేలోకం ఎరుగని...
అతి భారమైన...
అంధకార భరితమైన...
మెతుకులేని...అతుకుల...
గతుకుల...బ్రతుకు బాటలో...

కులంపేర అణచివేతలను...
ఆర్ధికపరమైన ఆక్రందనలను...
కష్టాలను...కన్నీళ్లను దిగమింగి...
ఎన్నో అవమానాలను...
మరెన్నో అవహేళనలను...
ఎదురు దెబ్బలను తట్టుకొని...
ఎదుగు బొదుగులేని బడుగు
జీవితంలో అడుగడుగునా
గండాలను...సుఖదుఃఖాల
సుడిగుండాలను దాటుకుని...

విషం చిమ్మే విధిని ఎదిరించి...
ఆకలిని పేదరికాన్ని జయించి...
నిరుపేద కూలిగా ఒక బిడ్డకు తల్లిగా...
ఎర్రని ఎండలో 8 కి.మీ కాలి నడకన
కాలేజీకెళ్ళి ఏడేళ్లు పట్టుదలతో చదివి...
తన భర్త కూతురు తోడు రాగా...
ఒక ముతక చేనేత చీరకట్టుకుని ...
కాళ్ళకు పారగాన్ చెప్పులు తొడుక్కుని...

శ్రీకృష్ణ దేవరాయల
విశ్వవిద్యాలయం
21వ స్నాతకోత్సవంలో...
రాళ్ళలో రత్నంలా...
మట్టిలో మాణిక్యంలా...
ఖరీదైన కోహినూర్ వజ్రంలా...
తళుక్కున ఒక "మెరుపై" మెరిసి...
"ఎవరెస్టు శిఖరం "ఎక్కినంతగా
ఆత్మతృప్తితో సగర్వంగా వేదిక నెక్కి...

గవర్నర్ గారి చేతులమీదుగా...
తన ఏడేళ్ళ కృషికి ప్రతిఫలంగా...
అతిక్లిష్టమైన రసాయన శాస్త్రంలో...
గైడ్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ పర్యవేక్షణలో...
"ఎ‌ స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్"అన్న
అంశంపై పరిశోధనా పత్రాలు సమర్పించి...
"డాక్టరేట్ పట్టా" దక్కించుకొని...
ఎందరో "ఆడపిల్లలకు ఆశాకిరణంగా"...
ఆధునిక యువతకు ఆదర్శంగా నిలిచిన...

స్పూర్తి ప్రదాత...
జ్ఞాన దేవత...
అక్షర జ్యోతి...
చదువులతల్లి...
సావిత్రి భాయి
పూలేె వారసురాలు...
చదువులతల్లి డాక్టర్ సాకే భారతి...
ఘన విజయానికి...వెనుకనున్నది
తాత...సుంకన్న...భర్త...శివప్రసాద్ ల
రెండుఆత్మలని నాలుగు అభయహస్తాలని..
వారి ప్రేరణ...ప్రోత్సాహం...త్యాగమేనని...
సోషియల్ మీడియాలో వైరల్ ఔతున్న
ఒక సంతోషకరమైన...సంచలన వార్త...

"కృషివుంటే మనుషులు ఋషులౌవుతారు...
మహాపురుషులౌతారు"...
అన్నది ఒకనాటి సినీ చైతన్యగీతం...

అదే కసి...కృషి...పట్టుదలతో...
ఒక ఆశయంతో అంకితభావంతో
శ్రద్ధతో ఉన్నతవిద్యను అభ్యసిస్తే...
గౌరవప్రదమైన డాక్టరేట్ పట్టాను...
సాధించుట సాధ్యమేనని నిరూపించింది...

"కష్టే ఫలి"...
"శ్రమయేవ జయతే "...
అన్న నినాదాలకు...నేడు
నిలువెత్తు ప్రతిరూపంగా...
నిలిచింది...పేదరికాన్ని గెలిచింది...

జయహో జయహో...ఓ చదువుల తల్లి...
డాక్టర్ సాకే భారతి...నీకిదే నా అక్షరహారతి.