ఒక శిధిలమైపోయే శిలను
సుందర దేవతా శిల్పంగా చెక్కితే
ఆపై ఇక ఆ శిల్పానికి నిత్యం పూజలే
పునస్కారాలే...అర్చనలే...అభిషేకాలే
గుళ్ళో శిల్పాన్ని దర్శించిన భక్తులు
ఆశిలలో దాగిన దైవానికే మ్రొక్కుతారు
కానీ కళాకారులు గతంలో కెళ్తారు
శిల్పి రూపాన్ని గుర్తు చేసుకుంటారు...
ప్రత్యక్షంగా....శిల్పికళా నైపుణ్యాన్ని
అదృశ్యంగా...శిల్పాన్ని చెక్కిన
శిల్పాన్ని వీక్షిస్తారు...స్మరించుకుంటారు...
ఆపై శివున్ని దర్శించుకుంటారు...
ఆ "శిల్పం" గుళ్ళో ఉన్నంతకాలం
ఆ "శిల్పి" కూడా చిరంజీవియే...
గాయకుడు...
యువ నాయకుడు...
అంబేద్కర్ అభిమాని...
అణగారిన ప్రజల ఆశాకిరణం...
కంచుకంఠం"వరంగా" పొందిన
గానగంధర్వుడు సాయిచందు...
ఎన్నో రాత్రులు...
నిద్రాహారాలు మాని...
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి...
ఎక్కిన ప్రతివేదిక దద్దరిల్లేలా...
దిక్కులు పిక్కటిల్లేలా...గొంతెత్తి...
సింహంలా గర్జిస్తూ ఎగిరి గంతులేస్తూ...
ఉద్రేకంతో ఊగిపోతూ గాలిలోతేలిపోతూ...
కేసీఆర్ పార్టీసభల్లో ధూంధాంగా ఆడిపాడి..
వేదిక ముందున్న లక్షలాదిమంది
అభిమానులను...కార్యకర్తలను
కుర్రకారును...ఉర్రూతలూగించిన
అమర గాయకుడు సాయి చందు
పాడిన "ప్రతిపాటకు ప్రాణం"పోసె ఆపై
గుండెపోటుకుగురై...రక్షించేవారు లేక
సకాలంలో సరైన వైద్యసహాయమందక...
ఆసుపత్రిలో దిక్కులేని ఒక "అనాధగా"...
కట్టుకున్న భార్యచేతిలోనే కన్ను మూసె...
నిత్యం తెలంగాణ ప్రజల
గుండెల్లో పల్లెపల్లెలో వాడవాడలా
మారుమ్రోగే పాటలే సాయి చందుకు
''ప్రాణం పోస్తాయి" తిరిగి బ్రతికిస్తాయి...
అందుకే భౌతికంగా దూరమైన "సాయికి"
ప్రవహించే "ఆయన పాటకు"మరణం లేదు



