Facebook Twitter
కంచు కంఠం మూగబోయింది పాటల పర్వతం ఒరిగిపోయింది

ఎవ్వడు చెప్పిండురా..!
మీరెక్కువజాతోళ్ళని..?
ఏడా రాసుందిరా..!
మేం తక్కువ జాతోళ్ళని..?

నిన్ను నన్ను కన్నతల్లి
భరతమాత ఒక్కటే..!
నీవు నేను బ్రతుకుతున్న
భరత భూమి ఒక్కటే..!

నీకు నాకు నడుమ
ఈకులం అఢ్డుగోడ ఏందిరా..?
ఈ కులం కుళ్ళును
సృష్టించింది ఎవ్వడురా..?
ఎవడు...ఎవడు...?
ఎవ్వడు వాడెవ్వడురా..?

అంటూ సాయిచందు
కులనిర్మూలనకు...కృషి చేస్తూ...
తరతరాలుగా ఆరని అంటరానితనాన్ని...
మంట కలిపేందుకు...కంకణబద్దుడై...

గొంతెత్తి వేదికలమీద
అభ్యుదయ గీతాలనాలపిస్తూ... 
కుర్రకారును ఉర్రూతలూగిస్తూ...
బహుజనులను ఉత్తేజపరుస్తూ...

అసెంబ్లీలో అడుగు పెట్టాలని...
అణగారిన బడుగు బలహీన
మైనారిటీ వర్గాలకూ అండగా
నిలవాలని కమ్మని కలలెన్నోకంటూ...

అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...
రాజకీయాలలో రాణిస్తున్న తరుణంలో
క్రూరమైన విధి ఓ విషపు నవ్వు నవ్వింది
39ఏళ్ళకే సాయిని మృత్యువు ముద్దాడింది

ఔరా విధి ఎంతటి బలీయమైందో కదా...
మనిషొకటి తలంచిన దైవం మరొకటి
తలంచునే సృష్టి స్థితి లయలు దైవాధీనాలే

కానీ ఎందుకంత తొందరో ఏమో...
ఓ చైతన్య శిఖరం కుప్పకూలిపోయింది
ఓ చల్లని మాటలమంచు కరిగిపోయింది
ఓ పాటల పర్వతం క్షణాల్లో ఒరిగిపోయింది
సాయిచందు"కంచు కంఠం"మూగబోయింది