Facebook Twitter
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా..! రక్తసంబంధం విలువ నీకు తెలియదురా!

 

సినీగేయ రచయిత
శ్రీ మిట్టపల్లి సురేందర్ వ్రాసిన
అమరవీరులను కన్నతల్లుల
"పురిటి నొప్పుల పాటను"
కూసింత మార్పులు చేసి...

"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా..!
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ బ్రహ్మ దేవా..!
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"...
ఈశ్వరా...శంకరా...అంటూ సాయిచందు

సుదీర్ఘంగా గుక్కతిప్పుకోకుండా రాగంతీసి
పాటలో లీనమైపోయి పాడుతూవుంటే...
ఒళ్ళు పులకరిస్తుంది..!
గుండె బరువెక్కుతుంది..!
కళ్ళవెంట కన్నీటి వర్షమే..!

ప్రత్యేక తెలంగాణా సాధనకై...
కిరోసిన్ మంటల్లో చిక్కుకుపోయి...
కళ్ళముందే కాలిపోయి అమరవీరుడైన
కన్నకొడుకు శ్రీకాంత్ ఆచారి గుర్తొచ్చి
ఆ కన్నతల్లి తల్లడిల్లి పోతుంటే...
విలవిలలాడిపోతుంటే...
విలపిస్తూవుంటే...
కుర్చీలో కూర్చొని
కుమిలి కుమిలి ఏడుస్తూవుంటే...

కన్న...ఎవరి కంటనైనా
కన్నీటి వరదలే...
విన్న...ఎవరి గుండెలైనా
పొంగిపొరలే చెరువులే...
సియం కేసీఆర్ నే కంటతడి
పెట్టించిన తెలంగాణా సాధనకు
ఊపిరైన ఈ పాటను ఎన్నిసార్లు
విన్నా తనివి తీరదు...కన్నీరు ఆగదు.