Facebook Twitter
అస్తమించిన అమర గాయకుడు సాయిచందు ...

నాడు తెలంగాణ సాధనలో
అమరుడైన శ్రీకాంత్ ఆచారి
"సంస్మరణ సభలో "...
"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ దేవదేవా..!
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"...
ఈశ్వరా...శంకరా...ఆఆఆఆఆఆ...అంటూ

గంభీరమైన కంఠంతో గుక్కతిప్పుకోకుండా
అందరి గుండెల్ని పిండేసేలా...
అందరి కళ్ళలో పాతాళగంగఉప్పొంగేలా...
సుదీర్ఘంగా రాగం తీసి ఆలపించిన
ఆగీతం విన్న శ్రీకాంత్ ఆచారితల్లి కన్నీటి
పర్యంతమై విలవిలలాడిపోయిందే...
సీఎం కేసీఆర్ సైతం కంటతడి పెట్టారే...
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు! ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!

కేసీఆర్ ప్రతిసభ
నీపాటతోనే ప్రారంభమే...
నీవు వేదికనెక్కి దిక్కులు పిక్కటిల్లేల
ధూం...ధాం...గా పాటలు పాడుతుంటే యువకులంతా
ఉత్తేజితులయ్యారే...
ఉర్రూతలూగిపోయారే...
ఉద్యమానికి ఊపిరిలూదారే...
ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయే...
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!

పాటకు ప్రాణంగా...
ఉద్యమాలకు ఊపిరిగా...
ఓ విప్లవ వీరుడిగా ...
ఓ ఉద్యమ సూర్యుడిగా...
ఓ బహుజన బాటసారిగా...
ఓ అరుణోదయ కిరణంగా...
ఓ ప్రగతిశీల ప్రభంజనంగా...
అణగారిని ప్రజల ఆశాజ్యోతిగా...
అంబేద్కర్ ఆశయాల దివిటీగా...
ఒక కవిగా...ఒక కళాకారుడిగా...
ఒక గాయకుడిగా...ఒక నాయకుడిగా...

ఎదుగుతున్న తరుణంలో
ఎవరి కన్ను కుట్టిందో ఏమో
అనకొండలా...మృత్యువు...చుట్టేసింది
39 ఏళ్ళకే మృత్యుకుహరంలోకి నెట్టేసింది

నీ ఆటపాటలతో
నీ మధుర కంఠంతో
మమ్మల్ని మంత్రముగ్ధుల్ని
చేసిన ఓ గాన గంధర్వా...!
కులదురహంకారులపై
అక్షరమే ఆయుధంగా పోరాడిన
ఓ విప్లవ వీరుడా...ఓ శూరుడా !
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!