Facebook Twitter
అభినవ బుద్దుడు అంబేద్కర్..!

అంబేద్కర్ అంటే....
ఉప్పెనలా తరలివచ్చిన
లక్షలాదిమంది అభిమానులను
బౌద్ధంలోకి మార్చిన "అభినవ బుద్దుడు"

అంబేద్కర్ అంటే....
ఎందరో మేధావులతో నిండిన‌
జ్ఞానసభలో...భాస్కరుడిలా
భగ్గునమండిన "పండిత ప్రకాండుడు"

అంబేద్కర్ అంటే....
ఎవరెన్ని విమర్శలు చేసినా విషం చిమ్మినా
ఎవరెన్ని ఘోరఅవమానాలకు గురిచేసినా
ఎవరెన్ని రాళ్లు విసిరినా ఆ రాళ్లనే మెట్లుగా
మార్ఛుకున్న "స్థితప్రజ్ఞుడు...రాజనీతిజ్ఞుడు"

అంబేద్కర్ అంటే....
ఎన్నిఎదురు దెబ్బలు తగిలినా సహనంతో
సహిస్తూ చలించక, తలవంచక, భయపడక
వెన్నుచూపక, వెనుతిరగక, ఒక్కడే
ఒక సైన్యంలా ముందుకు దూసుకుపోయి

ఒంటరిగా పోరాడిపోరాడి గెలిచిన వీరుడు 
మగధీరుడు..."మహర్ పులి...బాహుబలి"

అంబేద్కర్ అంటే....
పుట్టిననాటి నుండి గిట్టేవరకు
తన అంటరానిజాతి సుఖసంతోషాలకోసం
సంక్షేమంకోసం విముక్తికోసం అన్నిరంగాల్లో
అభివృద్ధికోసం తన రక్తాన్ని ధారబోసిన
జీవితాన్ని అంకితంచేసిన మాహనీయుడు
మహా మేధావి...అరుణోదయ భాస్కరుడు
రాజ్యాంగ శిల్పి "భావిభారతస్పూర్తి ప్రదాత"

అంబేద్కర్ అంటే....
మన గుండె గుడిలో నిలిచిన
మన వాడవాడలో విగ్రహమై వెలసిన
మహనీయుడు...మహోన్నతుడు
విశ్వ మానవుడు...జ్ఞాన సూర్యుడు 
అందరి దేవుడు...ఆపద్భాందవుడు
అణగారిన బడుగు బలహీన వర్గాల

 ఆశాజ్యోతి "అమరజీవి అంబేద్కరుడు"