తన జాతికి దాహమేస్తే
చెరువులోని మంచినీరు
తోడుకో నివ్వక పోయినా...
తనకు దాహమేస్తే కాలేజీ కూజాలో
మంచి నీళ్ళు త్రాగనివ్వకపోయినా...
అంటరాని వాడంటూ
ఊరికి దూరంగా ఉంచినా...
బడిలో బయటనే కూర్చోబెట్టినా...
వెనుక ఉన్న తమ టిఫిన్ బాక్సులు
మైలపడతాయని లెక్కలు వ్రాసే
బ్లాక్ బోర్డును తాకనివ్వక పోయినా...
14 మంది పిల్లలను కని
పోషించలేక నిరుపేదలైన ఆ
తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నా...
ఏ ఆర్థిక స్తోమత లేక
దుర్గంధభరితమైన చేపలమార్కట్ లో
రాత్రిలో చిన్నవయసులోనే పెళ్లి జరిగినా...
బిఎ ఫస్ట్ క్లాస్ లో పాసై
మంచితనం మానవత్వమున్న
బరోడా మహారాజు
ఉదారహృదయంతో
అమృతహస్తాలతో ఆశీర్వదించి
అందించిన స్కాలర్ షిప్ తో
భార్యా పిల్లలను ఊరిలోనే వదిలేసి
ఎంతో దూరం విదేశాలకు
ఓడల్లో ప్రయాణించి...
కసితో కృషితో
ఒక ఆశయంతో
గట్టి పట్టుదలతో
తెల్లదొరల మధ్య సూటు బూటు
వేసుకొని "తెల్లనికొంగలా"తిరుగుతూ
భారతదేశంతో తనను
సంస్కృతం చదవనివ్వకపోయినా...
ఇంగ్లీష్ విద్యలో పట్టును సాధించి
విదేశాలలోని విశ్వవిద్యాలయాలలో
అన్ని ఆర్థిక, రాజకీయ, గ్రంధాలను
న్యాయ, తత్త్వ, శాస్త్రాలను
రాత్రింబవళ్ళు ఔపాసన బట్టి
ఉన్నత విద్యను ఆర్జించి...
అటు భారత దేశంలోను
ఇటు ప్రపంచంలోను
సకల సౌకర్యాలున్న
ధనవంతుల శ్రీమంతుల
అగ్రవర్ణాల విద్యార్థులెవరూ
కలలోనైనా ఊహించని
తమ జీవితంలో సాధించలేని
డిగ్రీలెన్నిటినో సాధించి...
నిద్రాహారాలు మాని ఏళ్ళతరబడి
పురాతన గ్రంధాలను పరిశోధించి
ఏ బహుభాషా పండితులు సైతం
వ్రాయలేనన్ని
అతివిలువైన
విజ్ఞాన దాయకమైన
బృహత్ గ్రంథాలను తన
రక్తాన్ని ధారబోసి భావితరాలకోసం వ్రాసి
చరిత్రగదిలో రహస్యనిధిలా దాచిఉంచి...
మహిళల హక్కులకోసం వ్రాసిన
హిందూ కోడ్ బిల్లు ఆమోదంలో
"నా నూతన కేబినెట్ లో
ఆణిముత్యం అంబేద్కర్" అన్న
ప్రధాని నెహ్రూతోనే విభేదించి
న్యాయశాఖమంత్రిగా రాజీనామా చేసి
గాంధీజీ కుట్రలు కుతంత్రాలు నచ్చక
జాతీయ కాంగ్రెస్ లో ఇమడలేక...
అడుగునున్న
బడుగులందరి
అభివృద్ధి కోసం ...
ఆత్మ గౌరవం కోసం...
కులనిర్మూలన కోసం ...
మనిషి మనిషి
మధ్య మంటలు రేపే
మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేసి...
అంటరానితనం కోసం...
అంటరానివారి
ఆలయ ప్రవేశం కోసం
మహద్ చెరువులో నీళ్ళకోసం
రిపబ్లికన్ పార్టీని స్థాపించి...
ఒక్కడే ఒక సైన్యమై
రాజకీయంగా పోరాటాలెన్నో చేస్తూ
ఎన్నో సభలలో సమావేశాలలో
వందల వేల ప్రసంగాలు చేసి ...
బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి...
ఆరోగ్యం సహకరించకపోయినా
ప్రపంచంలోని ప్రజాస్వామ్య
దేశాధినేతలే నివ్వెరపోయేలా
తన రక్తాన్ని స్వేదంగా మార్చి
రాజ్యాంగ రచనచేసి...
బహుజనుల బ్రతుకుల్లో
వెన్నెల వెలుగులు నింపిన...
జాతినేత...
అందరివాడు...
అపరమేధావి...
ఆత్మబంధువు...
జ్ఞానసూర్యుడు...
విశ్వమానవుడు...
పోరాటయోధుడు ...
ఉద్యమాల యుద్ధనౌక...
బహుముఖ ప్రజ్ఞాశాలి...
భారత రాజ్యాంగ నిర్మాత...
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి...
అమరజీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్...కి
వందనం...
అభివందనం...
పాదాభివందనం...



