మన న్యాయదేవత
కళ్ళకు గంతలు ఎవరు కట్టారో...
ఎందుకు కట్టారో...ఎప్పుడు కట్టారో
ఎవరికీ తెలియదు...కానీ...
మూగజీవుల హింసకు
మూలబిందువైన...
తమిళనాట ఆడే
"జల్లికట్టను"క్రూరమైన క్రీడ...
తమిళుల సాహసమట...
తరతరాల సంస్కృతట...
విషాదంలో వినోదమట...
భిన్నత్వంలో ఏకత్వమట...
కానీ ఆ ఆటలో...
పదునైన కత్తులు కటారుల వంటి
బలిసిన ఆ ఎడ్ల దున్నపోతుల
కొమ్ములకు బలై...కొన ఊపిరితో
రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకునే
యువకులెందరో...ఎందరో...ఎందరో...
ఆఆట ఆడి ఓడి ఒంటినిండా
గాయాలతో ...ఆసుపత్రులపాలై...
కన్నుమూసి కాటికెళ్తే...కుమిలిపోయో
కుటుంబాలెన్నో...ఎన్నో...ఎన్నెన్నో...
ఇది మన కళ్ళెదుటే జరిగే
క్రూరమైన...అతిఘోరమైన
ప్రాణాలు ఫణంగా పెట్టి ఆడే క్రీడ
అందులో ఆనందం ఆవగింజంత
పెనుప్రమాదం...వ్యాపారం కొండంత
అట్టి అతి ప్రమాదకరమైన జంతు క్రీడకు
జైఅంది ఆడుకోమంది అభ్యంతరం లేదంది
సంస్కృతికి సలామంది నా న్యాయదేవత...
ముచ్చట పడి నవ్వింది ఆ మృత్యుదేవత...
అందుకే...
జయహో జయహో...
న్యాయదేవతకు...జయహో...
జయహో జయహో జల్లికట్టుకు జయహో
ఇది జంతువులతో కాదు
మృత్యువుతో ఆడే వికృత క్రీడని...
ఆచారం పేరిట ప్రజలప్రాణాలతో
చెలగాటమేనని...భగ్గుమంటోన్న...
జంతు సంరక్షకులకు...క్షమాపణలతో...



