Facebook Twitter
బ్రిటిష్ కింగ్ చార్లెస్...3 పట్టాభిషేకం

ఈ భూగోళమంతా...
భయంకరమైన భూకంపాలతో...
వరదలతో...సునామీలతో...
మంచు తుఫానులతో...
రాజ్యకాంక్షతో...భీకరయుద్దాలతో...
ఎటుచూసినా రక్తపుటేరులే పారుతువుంటే...
ఆకలిచావులతో ధరణి దద్దరిల్లిపోతూవుంటే...

ఏ పాపమెరుగని అమాయకపు ప్రజలు
రెక్కలు విరిగిన పక్షుల్లా పిల్లాపాపలతో ఇరుగుపొరుగు దేశాలకు ప్రాణభయంతో
పరుగులు పెడుతూవుంటే...

ప్రపంచ ప్రజలు...దుర్భర దారిద్ర్యంలో
బిక్కుబిక్కుమంటూ బ్రతుకులీడుస్తూవుంటే

విధివంచితులూ...క్షతగాత్రులు
ఆసుపత్రిల్లో సకాలంలో వైద్యం
అందక అల్లాడిపోతూవుంటే...
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూవుంటే...

అనాధలై...అస్థిపంజరాలై...
"అన్నమో రామచంద్రా" అంటూ
ఆకలికి అలమటిస్తూవుంటే...
ఆపన్న హస్తాలకోసం
ఆశతో ఎదురు చూస్తూవుంటే...

బడుగు దేశాల ప్రజలెందరో
విలువైన పోషకాహారం...విద్య
వైద్యం అందక విలవిల్లాడుతూవుంటే...

కడుపునిండా తిండిలేక...
కంటినిండా నిద్రలేక...
ఒంటినిండా బట్టల్లేక...
జీవశ్చవాల్లా జీవిస్తూవుంటే...

నేడు పట్టాభిషిక్తులైన
ఓ రాజదంపతులారా..!
అట్టివారి ఆకలికేకలు
మీ చెవులకు వినిపించడం లేదా..?
అట్టి వారి కన్నీటి ధారలు
మీ కళ్ళకు కనిపించడం లేదా..?
ప్రేమ దయ జాలి కురిపించి
ఉదారహృదయంతో వారిని ఆదుకోక...

ఈ పురాతన ప్రమాణ స్వీకార...కిరీట ధారణ...పట్టాభిషేక...మహోత్సవాలేమిటి?
కోటానుకోట్ల ఖర్చుతో
ఈ రాచరికపు అంగరంగ వైభోగమేమిటి..?
ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి..!

గతంలో...
ఎన్నో దేశాలమీద
దండయాత్రలు చేసి...
బలహీనుల్ని బానిసలుగా మార్చి...
ఎన్నో ఏళ్లు ఆ దేశాలను పరిపాలించి...
వాటి సంపదనంతా దోచుకొని దాచుకొని
రవి అస్తమించని సామ్రాజ్యంగా కీర్తి గడించి

మీకోసం మీపిల్లల పిల్లల కోసం...
వెయ్యేళ్ళకైనా తరగని...కరగని 
లెక్కకందని...స్థిరచరాస్తుల్ని కూడబెట్టి
కడకేమి కాటికి..."పట్టుకు" పోదామని...?
ఏమి "మూటకట్టుకు" పోదామని..? దేనికి
ఈ కోటానుకోట్ల ఆస్తుల ఆర్జన ? అందుకే...

నేడు పట్టాభిషిక్తులైన
ఓ రాజదంపతులారా..!
ఆలోచించండి..!
ఒక్కసారి ఆలోచించండి..!
మొన్న కరోనా మహమ్మారికి బలై
కన్నుమూసి కాటికెళ్ళిన కోటీశ్వరులంతా
సమాధులనుండి పంపిన సందేశం ఒక్కటే...

నాది నాది అనుకున్నదేదీ నీదికాదని...
రాణులైనా...రాజులైనా...చక్రవర్తులైనా...
కుబేరులైనా...కూటికిలేని నిరుపేదలైనా...
"మృత్యుదేవత"ముందర
అందరూ సమానులేనని"...
ఈ నేలపై ఈ మనిషి...
జీవితం...మూన్నాళ్ళ ముచ్చటేనని..