మానవత్వం మరచిన ఓ మనిషీ!
నీవు బ్రతికినంతకాలం,అతి భయంకరమైన పాపాలు ఘోరమైన నేరాలు,నీచమైన కార్యాలు చేశావేమో
నీ చుట్టూవున్న నలుగురిని
నవ్వులపాలు చేశావేమో, నరకకూపంలో త్రోశావేమో
అధికారముందన్న అహంకారంతో ,ఊగిపోయావేమో
ఉన్నదాంతో తృప్తిచెందక ఉరుకులు పరుగులు పెట్టావేమో
తెలిసో తెలియకో చేయరాని ఎన్నోతప్పులు చేసి
తిరిగి తిరిగి అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేశావేమో
అహంకారం, అవివేకం, అజ్ఞానం, అమాయకత్వంతో
మూర్ఖత్వంతో,మొండితనంతో,ఎవరేమిచెప్పినా వినలేదేమో
ఎవరిని లెక్క చేయలేదేమో
ఆపదలో వున్నవారినెవ్వరినీ ఆదుకోలేదేమో
ఆదుకోకపోగా నమ్మిన వారినే దోచుకొని
ఆ సొమ్మును స్విస్ బ్యాంకులో దాచుకున్నావేమో
నేడు కరోనా రక్కసికి చిక్కావు ఉరికంబమెక్కావు
అందుకేనేమో నేడునీకీ దిక్కులేని ఈ కరోనా చావు
ఓ మనిషీ ఇకనైనా నీవు కొత్తగా జన్మించి తీరాలి
నీ బూజుపట్టిన బ్రతుక్కి బంగారపు రంగులద్దుకోవాలి
ఔనిక,కరోనాకు ముందు మనిషి, కరోనా తర్వాత మనిషి
అంటూ మనిషి మనుగడలో ఒక వింతవిభజన జరగాలి
(ఎంత ఆస్తివున్నా, మేడలుమిద్దెలు ఎన్నున్నా
ఎన్నో వేలకోట్ల వ్యాపారాలు చేస్తున్నా, ఖరీదైన కార్లు, బంగాళాలెన్నివున్నా, ఎంతపెద్ద కుటుంబమైనా,
ఎంతమంది బంధువులున్నా, కరోనాతో మృతి చెందితే మాత్రం వారిది అత్యంత దయనీయమైన స్థితే)



