శివునిఆజ్ఞ లేనిదే
చీమైనా కుట్టదంటారే
ఆ సృష్టికర్త ప్రమేయం లేకుండా
ఈ భూమిపై ఏ జీవీ పుట్టదంటారే
మరి ఈ కరోనా జన్మకు కారకులెవరు?
మా పాపాలే మాకు శాపాలా?
మా బ్రతుకులు నరక కూపాలా?
మా జీవితాలు ఆరిపోయే దీపాలా?
ఓ దేవుళ్ళారా! ఓ దేవతలారా !
ఎక్కడున్నారు ? మీరేమైపోయారు?
మేము కాదా
మీ సుందర శిల్పాలను చెక్కింది
మేము కాదా
మీకు గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట చేసింది
మేము కాదా
మీకు దీపాలు వెలిగించి హారతి పట్టింది
మేము కాదా
మీకు అర్చనలు చేసింది నిత్యం నైవేద్యం పెట్టింది
మేము కాదా
మిమ్ము వాహనాలలో ఎక్కించి వీధివీధిలో
ఊరేగించింది ఘనంగా ఉత్సవాలు జరిపించింది
ఎక్కడో చైనాలో పుట్టి
కత్తులు కటారులు పట్టి
కాలరక్కసిలా ఈ కరోనా ప్రజల
కుత్తుకలు తెగనరుకుతువుంటే
మేకల మందలో దూరిన తోడేలులా
పీకలు పిసుకుతువుంటే
జింకలగుంపుపై విరుచుకుపడిన పులిలా
గొంతులు కొరుకుతువుంటే
కంటికి కనిపించిన వారందరిని
కాలసర్పమై కాటు వేస్తుంటే
కాటికీడ్చుకు పోతూవుంటే
ఓ దేవుళ్ళారా! ఓ దేవతలారా !
ఏమైపోయారు? మీరెక్కడున్నారు ?
ఓ దేవుళ్ళారా ! ఓ దేవతలారా !
కరోనా ముప్పును తప్పించండి
కాలనాగై కాటు వేసే కరోనా పేరు
వింటేనే ఒంట్లో వణుకుపుడుతున్నా
ప్రజలంతా విలవిలలాడిపోతున్నా
గట్టునపడిన చేపల్లా గిలగిలలాడిపోతున్నా
దిక్కుతోచక బిక్కుబిక్కు మంటూ
ఊపిరాడక ప్రాణభయంతో
ఉక్కిరిబిక్కిరైపోతున్నా
ఇళ్ళలోనే స్వీయ నిర్బంధంలో వుంటూ
నేడు సెల్ఫ్ లాక్ డౌన్ తో
ఆలయాలన్నీ మూతపడిన వేళ
మా గుండెలనే గుళ్ళు,గోపురాలుగా
మా మనసులనే మసీదులుగా
ప్రార్థనా మందిరాలుగా మార్చుకొని
మీ దివ్యచరణాలకు మ్రొక్కి
కొండంత ఆశతో వేడుకుంటున్నాం
ఓ దేవుళ్ళారా ! ఓ దేవతలారా !
రండి రండి మృత్యువులా పొంచివున్న
ఈ కరోనా ముప్పును తప్పించండి
రండి రండి ఈ కరోనా అంటువ్యాధిని
ఖతం చేస్తామని,అభయమివ్వండి
ఓ దేవుళ్ళారా ! ఓ దేవతలారా !
రండి రండి విశ్వమంతా విషం చిమ్ముతూ
విజృంభిస్తున్న, విధ్వంసాన్ని సృష్టిస్తున్న
ఈ కరోనా విషపురుగును పాతాళంలో పాతిపెట్టండి
అనంత విశ్వానికి అఖండ జ్యోతులై వెలిగునిచ్చే,మీరు గర్భగుడిలో గాఢాంధకారంలోఎందుకు మౌనంగావున్నారు?
తలుపులు తెరుచుకొని చీకటిని చీల్చుకుని
ఓ దేవుళ్ళారా! ఓ దేవతలారా !
రండిరండి ఈ కరోనా రక్కసిని కాల్చి బూడిద చెయ్యండి



