Facebook Twitter
శిలువ శిక్ష - శ్రీరామ రక్ష...

ఓసీ కరోనా రాక్షసీ !

మేమెవరమో తెలుసా ?

మేము భారతీయులం !

వీరులం శూరులం

విప్లవవీరులం విశ్వవిజేతలం

నీ భరతం పట్టేందుకు సిద్దంగా వున్న

అల్లూరి సీతారామరాజులం

 

ఓసీ కరోనా పిశాచి !

మేమెవరమో తెలుసా ?

మేము భారతీయులం !

కండబలం గుండెబలం వున్నవాళ్ళం

పుష్టికరమైన ఆహారం తీసుకొని

షష్టి పూర్తి చేసుకునే వాళ్ళం

 

ఓసీ కరోనా కాలసర్పమా !

మేమెవరమో తెలుసా ?

మేము భారతీయులం !

పచ్చని ఆకుకూరలు పండ్లు ఫలాలే

మాకు ఔషధాలు

మంచి అలవాట్లే మా ఆయుధాలు

 

ఓసీ కరాళనృత్యం చేసే

ఓ కరోనా మృత్యువా !

నీకు భయపడి మేము ఇంటిలో

దొంగల్లా దాక్కున్నామని

ఇకిలి నవ్వులు నవ్వకు

వెకిలి చేష్టలు చేయకు

వేధించకు, వెంటపడకు

 

కంటబడితే, కసిదీరా

కాలసర్పమై కాటువెయ్యాలని,

కబళించాలని, కాటికీడ్చాలని,

కలలు కనకు,నీ కలలు కల్లలౌతాయి

రాక్షస ప్రణాళికలేవీ రచించకు

అవి నీటి మీద రాతలౌతాయి

రాలిపోయే ఆకులౌతాయి

 

ఓసీ కరోనా మాయదారి మహమ్మారీ !

మేమెవరమో తెలుసా ?

మేము భారతీయులం ! నీ భరతం పడతాం

నీకు మందు కనిపెడతాం,నీకు బొంద పెడతాం

మాకెరుకే మా ఇల్లే మాకు శ్రీరామరక్ష

ఇక నీకు వేస్తాము త్వరలో శిలువశిక్ష