Facebook Twitter
ఒకే కులం ! ఒకే మతం ! ఒకే జాతి !

కావుకావు మంటూ

ఏలరా ఆ కాకి గోల ?

కులం...కులమంటూ

ఏలరా ఆ చిన్నచూపు ?

 

ఓ మనువాదులారా !

ఓ మతోన్మాదులారా !

ఎన్నాళ్లని ఎన్నేళ్లని, ఇంకా

ఏలరా ఆ కాకి గోల?

తరచిచూడ....కళ్లు తెరిచిచూడ

కులగోత్రాలు...మలమూత్రాలురా !

విసర్జించుటే గొప్ప విజ్జతరా ! 

మానవత్వాన్ని...సమానత్వాన్ని

మంటకలపనివాడే మనువాదిరా !

 

ఎన్నాళ్లని ఎన్నేళ్లని, ఇంకా

ఏలరా ఆ కాకి గోల ?

కులమంటూ మతమంటూ

"కులం....కుళ్ళురా"

"మతం...ముళ్ళురా"

"కులం....గజ్జి కుక్కరా"

"తిరగనిస్తే...తప్పురా"

"మతం...పిచ్చి మొక్కరా"

"పెరగనిస్తే‌...ముప్పురా"

 

ఎన్నాళ్లని ఎన్నేళ్లని, ఇంకా

ఏలరా ఆ కాకి గోల?

మతం...మతమంటూ

"నిన్న మతం ఒక"

"మత్తు మందురా"

"నేడు ఆ పేరు ఎత్తితేనే

రక్తం చిందురా"

రాముడు కోరునా రక్తాభిషేకం...లేదే

అల్లా కోరునా అల్లకల్లోలం...లేదే

క్రీస్తు కోరునా కిరాతకం...లేదే

 

మరి కులంపేర...ఈ "కుమ్ములాటలు"

మతంపేర...ఆ "మారణహోమాలు"

ఎందుకురా ?

మానవత్వానికి ప్రతిరూపాలుగా

మారండిరా !

మనమంతా "మనుషులమేన్న"

మనదంతా "ఒకే కులమన్న"

మనదంతా "ఒకే మతమన్న"

మనదంతా "ఒకే జాతన్న"

అంబేత్కర్ "అమృతవాక్కుల్ని"

వివేకానందుడి "విశ్వసందేెశాన్ని"

మహాత్మాగాంధీ "శాంతినినాదాన్ని"

మహాత్మా జ్యోతిరావు పూలే 

"సమతా మమతా సందేశాన్ని"

కలనైనా మరువకండిరా !

మానవత్వానికి "మాయనిమచ్చ"తేకండిరా !

తోటి మనిషిని "తోబుట్టువుగా"చూడండిరా !

 

ఓ మనువాదులారా ! ఓ మతోన్మాదులారా !

ఇకనైనా ఈ కంప్యూటర్ 

యుగంలోనైనా "కుల మత రహిత"

"నవసమాజ నిర్మాణానికి నాంది" పలకండిరా !