Facebook Twitter
అందరికి ఆత్మబంధువులు ఆ ఇద్దరు

"అంటరానితనం ఒక శిక్ష"

"అందరికీ విద్య అందని ద్రాక్ష‌"

అనుకునేవారికి ఎవరూ

వెంటరాని ఒంటరి వారికి

అణగద్రొక్కబడిన అణగారిన

బడుగు బలహీన వర్గాలవారికి

మురికివారిగా ముద్రపడిన శూద్రుల

అస్పృశ్యుల బ్రతుకుల్లో వెలుగులు నింపాలన్న

తపనతో....త్యాగబుద్దితో...దూరదృష్టితో

తమ ఆస్థినంతా హారతికర్పూరం చేసి...

"52 పాఠశాలలు" స్థాపించి విద్యాదానం చేసిన

"మధ్యాహ్న భోజన పథకాన్ని" అమలుచరచిన

ఓ ధన్యజీవులారా ! ఓ త్యాగమూర్తులారా !

మీకు వందనం ! పాదాభివందనం !!

 

కరువు కోరల్లో చిక్కుకున్న

"రెండువేల మంది శూద్ర దళితపిల్లలకు"

భోజనాలనేర్పాటు చేసి క్షుబ్భాదను తీర్చిన

"సత్యశోధక్ సంస్థను" స్థాపించి

మహిళల హక్కులకై అహర్నిశలు కృషి చేసిన

ఓ మహాత్ములారా ! ఓ మహనీయులారా !

మీకు వందనం ! పాదాభివందనం !!

 

ప్రాణాలను ఫణంగా పెట్టి

అంటరానితనాన్ని మంటకలిపి

కులవ్యవస్థను‌ కూకటివేళ్లతో సహా పెకలించి

అగ్రవర్ణ బ్రహ్మణ ఆధిపత్యాన్ని ధిక్కరించిన

ఓ సంఘ సంస్కర్తలారా ! ఓ సాహసవీరులారా!!

మీకు వందనం ! పాదాభివందనం !!

 

నాటి "పితృస్వామ్యాన్ని" ప్రశ్నించి

"వితంతువుల శిరోముండనాన్ని" వ్యతిరేకించి

సమాజంలోని మూఢాచారాలను చీల్చిచెండాడి

"బ్రాహ్మణ వితంతువు బిడ్డను" దత్తతతీసుకున్న

ఓ పుణ్యదంపతులారా ! ఓ ఆదర్శమూర్తులారా !

మీకు వందనం ! పాదాభివందనం !!

 

మీరే మా ఇంటి ఇలవేల్పులు

మీరే మాకు ఆత్మబంధువులు...

మీరు చిరంజీవులు...

చిరస్మరణీయులు...

మీ స్మరణే ఒక ప్రేరణ...

మీ అడుగుల్లో అడుగులు వేస్తాం...

మీ ఆశయాలకు అంకితమౌతాం...

 

(పుణ్యదంపతులైన శ్రీ జ్యోతీరావు పూలే సహధర్మచారిణి సావిత్రిబాయి పూలేలకు నా అక్షరనీరాజనం)