Facebook Twitter
ఆ దళితజాతి జ్యోతి మీరే....

దగాపడ్డ ఓ దళిత బిడ్డలారా!

మీ తాతముత్తాతల తరం 

నిన్న కరుణ దయ జాలిలేని

కులరక్కసికి బలైపోయింది

మీ పిల్లల భవిష్యత్తు జరాభద్రం

 

దగాపడ్డ ఓ దళిత బిడ్డలారా !

మీ పిల్లలకే దేవుళ్ళ పేర్లు పెడితే 

వారు దేశ నాయకులు అవుతారు 

మీ పిల్లలకే మంత్రాలు శ్లోకాలు నేర్పిస్తే 

వారు గుళ్లలో పూజారులౌవుతారు 

మీ పిల్లలకే రాజకీయాలను నూరిపోస్తే 

వారు దేశాన్ని ఏలే నేతలౌతారు 

 

మీ పిల్లలకే ఆంగ్లం నేర్పించి 

అమెరికా పంపిస్తే వారు  

కంప్యూటర్ ఇంజనీర్లౌతారు 

కష్టపడి చదివిస్తే వారు కలెక్టర్లౌతారు

అప్పుడు దివికేగిన మీ తల్లిదండ్రులు 

దీర్ఘాయుష్మాన్ భవా అంటూ 

దీవెనలు కురిపిస్తారు

 

ఔను నేటి నుంచే ఈ నాటి నుంచే 

నిత్య చైతన్యం మీ నినాదం కావాలి 

మీ భాష మారాలి మీ బ్రతుకు మారాలి

ముందుతరాల వారికి మీరే స్ఫూర్తి కావాలి

 

దగాపడ్డ ఓ దళిత బిడ్డలారా !

అదిగో ఆ కులరక్కసి శవానికి ధవళ వస్త్రం 

కప్పి దహన సంస్కారం చేసిననాడే

దళితజాతికే మీరు దారిచూపే దీపాలౌతారు 

నాడే అంటరానితనమన్న

ఆరుఅక్షరాల శిలువశిక్షకు బలైన

అందరి ఆత్మలు శాంతిస్తాయి 

అమరజీవి అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తాయి

 

అందుకే దగాపడ్డ ఓ దళిత బిడ్డలారా!

ఇకనైనా నిద్ర మేల్కొని నిజం తెలుసుకోండి!

ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళు తెరుచుకోండి !