మొన్న...రెబల్ స్టార్ కృష్ణంరాజు
నిన్న.....నటశేఖర కృష్ణ
నేడు.....కైకాల సత్యనారాయణ...
ముగ్గురు సీనియర్ "నట దిగ్గజాలను"
కోల్పోయింది తెలుగు చలనచిత్ర సీమ
తన అద్భుత నటనా చాతుర్యంతో
వెండితెర మీద తమకెంతో గుర్తింపును
తెచ్చిన "నవరస నటనా సార్వభౌముడు"
కన్ను మూశాడని తెలిసి "నవరసాలు"
కన్నీటి సాగరంలో మునిగిపోయాయి...
1935 జూలై 25న కృష్ణజిల్లా...
గుడ్లవల్లేరు మండలం...
కౌతవరం గ్రామంలో...
లక్ష్మీనారాయణ సీతారావమ్మలను
పుణ్యదంపతులకు జన్మించి...
గుడివాడ ఎఎన్నార్ కాలేజీలో
ఈనాడు "రామోజీ రావుతో "
కలిసి డిగ్రీ వరకు చదివి...
నాగేశ్వరమ్మను పరిణయమాడి...
పద్మావతి...రమాప్రభాదేవి
రామారావు...లక్ష్మీ నారాయణలను
నలుగురు పుత్రరత్నాలను కనిన
కైకాల...సత్యనారాయణ...
"సిపాయి కూతురు" చిత్రంతో
హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు...
కరుడుగట్టిన విలన్ పాత్రలకేకాక...
"కృష్ణుడి పాత్రకు'"ఎన్టీఆర్ లా
ధర్మ రక్షణా దక్షుండ...
పాప శిక్షణా దక్షుండ...నంటూ
"యమధర్మరాజు"పాత్రలో లీనమైపోయి
డిఫరెంట్ కామెడీ డైలాగ్స్ తో కడుపుబ్బ
నవ్వించి "యముడంటే" ఎవరికీ భయం
లేకుండా చేసి ప్రేక్షకుల హృదయాలలో
చెరగని ముద్ర వేశారు కైకాల...
వైవిధ్య భరిత సాంఘీక పౌరాణిక జానపద
పాత్రలకు యస్వీఆర్ కి వారసుడయ్యాడు
అటు నిప్పులు కురిపించే...
కత్తులు దూసే...కసాయి పాత్రల్లోకి...
ఇటు హాస్యం పండించే జోకర్ పాత్రల్లోకి...
పరాకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని అలరించి
ఆకట్టుకున్న"విలక్షణమైన నటుడు" కైకాల...
సాంఘిక ...చారిత్రక...
పౌరాణిక...జానపద...చిత్రమేదైనా...
యముడు...భీముడు...రావణుడు...
కర్ణుడు...ఘటోత్కచుడు...
దుర్యోధనుడు...దుశ్శాసనుడు... హీరో...విలన్ ...కమెడియన్ ...
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ...పాత్రఏదైనా...
అద్భుతమైన హావభావాలు పలికించి...
ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న
"సంపూర్ణ నటుడు" సత్యనారాయణ...
1994లో నిర్మాతగా నంది పురస్కారం...
1996లో మచిలీపట్నం నుండి
టిడిపి ఎంపీగా రాజకీయరంగప్రవేశం...
2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం..
కానీ,878 చిత్రాల్లో అద్భుతంగా నటించి...
200మంది దర్శకులతో పనిచేసి...
ఏయన్నార్ ఎన్టీఆర్ యస్వీఆర్ తర్వాత
నాలుగో స్థానంలోఉన్న...
ఈ "నటశిఖరానికి"...
ఈ "కళామతల్లి ముద్దుబిడ్డకు"...
ఈ "నవరస నటనా సార్వభౌముడికి"...
రావాల్సిన "అవార్డులు" రాలేదని...
దక్కవలసిన"గుర్తింపు"దక్కలేదని...దానికి
"కులమే ఒక కారణమని"కుమిలిపోయిన
62 ఏళ్ళ కైకాల "సినీ ప్రస్థానం" నేడు జూబ్లీహిల్స్ "మహాప్రస్థానంలో "
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసింది...
తెలుగు ప్రేక్షకులు మరువలేని...
"మరణంలేని మహానటుడు"
కైకాల సత్యనారాయణ"ఆత్మకు శాంతి" కలగాలని...వారి కుటుంబసభ్యులకు
ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ...
అశృనయనాలతో...
బాధాతప్త హృదయాలతో...
అందిస్తున్న అక్షర నీరాజనం...



