Facebook Twitter
మా మామిడి చెట్టు మరణించింది

అమ్మా ! ఓ అమ్మా !
నీ గుండె ఆగింది...మా గుండె చెరువైంది
బ్రతుకు బరువైంది...కంట నీరు కరువైంది
మా ఇంట్లో...మామిడి చెట్టు మరణించింది
మా ఇంటి వెలుగు...మా కంటికి దూరమైంది

అమ్మా !  ఓ అమ్మా !
మొన్న...ఆకలని కేకలేస్తే నీ ఎర్రని రక్తాన్ని
తెల్లని పాలుగా మార్చి మా ఆకలి తీర్చావు
నిన్న...నీవు అర్ధాకలితో నిద్రించినా మమ్ము శపించలేదు

అమ్మా ! ఓ అమ్మా !
మొన్న...ఎన్ని గుడిమెట్లు ఎక్కినా
ఎన్ని ‌రాతి బొమ్మలకు మ్రొక్కినా
ఎంత వెదికినా దైవమున్న దారే కనిపించలేదు కళ్ళముందే...
కదలాడే‌ ఓ దేవత...
ఉందన్న ఊసేలేదు
నిన్న...నీవు కన్ను మూశాక
కాటికెళ్ళాక తెలిసింది
"మా కన్నతల్లి కన్నా దైవం"
ఇలలో ఇంకెవరున్నారని

అమ్మా ! ఓ అమ్మా !
మొన్న...నీవు చూపు ఆనక
కాళ్ళల్లో సత్తువలేక
మంచానికే అంకితమైతే...
మాకెక్కడ బరువైపోతావోనని
నిన్న...దేవతలాంటి నిన్ను
వృద్ధాశ్రమంలో విసిరేయకున్నా
ఇంటిలో అందరికీ నీవు శత్రువునే
నీతో ఎవరూ మాట్లాడేదీ లేదు
నీ ప్రక్కన కూర్చొని నిన్ను ప్రేమగా
ఎవరూ పలకరించిందీ లేదు
నిన్నెక్కడికీ తీసుకు పోయిందీ లేదు
అందరున్నా నీవు ఒంటరిగా
జైల్లో ఒక ఖైదీలా బందీగా బ్రతికావు

అమ్మా ! ఓ అమ్మా !
కొద్ది కాలమే...నీవు మంచాన పడి
ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లంతో కదలలేక
మా కళ్ళముందే....కన్నుమూస్తే
నా దైవమైన నిన్ను దహనం చేసిన
ఒక పాపిని నేను...నన్ను శపించక
దివినుండి ఇంకా దీవిస్తూనే ఉన్నావు
అమ్మా నన్ను క్షమించు...
మళ్ళీ నా తల్లిగా జన్మించు...
మరోజన్మలోనైనా...
తీరని నీ ఋణాన్ని తీర్చుకుంటాను