ఎనబది ఏళ్ళనాడు
పురుడు పోయగానే
పుత్రుడు పుట్టగానే
ఆకలై కేకలేస్తే పాలిచ్చి ఆకలి తీర్చి
అనారోగ్యం పాలైతే ఆందోళన చెంది
నా మలమూత్రాలను నిత్యం ఎత్తివేసి
నన్ను ఒడిలో ఉంచి ఊయలలూగించి
నన్ను బడిలో చేర్పించి అక్షరాలు దిద్దించి
నా బంగారు భవిష్యత్తుకు
బాటలు వేయించి
కట్టుకున్న భర్త కన్నుమూసినా
కూలినాలి చేసి
నా కడుపులో ఆకలితీర్చి
కొండలమీద బండలుమోసి
ఎండకు ఎండి వానకు తడిసి
కడుపునిండా తిండి లేకున్నా
కంటినిండా నిద్ర లేకున్నా
ఒంటరిగానే పోరాడి పోరాడి
అష్టకష్టాలు పడి నాకు
పెద్ధ చదువులు చెప్పించి
ఉన్నతమైన ఉద్యోగం ఇప్పించి
అప్పుచేసి ఘనంగా పెళ్ళి చేసి
తీర్చలేక ముప్పుతిప్పలు పడి
అహర్నిశలు నా అభివృద్ధినే కాంక్షించి
ఎన్నో కమ్మని కలలు కని
సమాజంలో నాకో ఉన్నతస్థానం కల్పించి
నన్ను ఒక ప్రయోజకున్ని చేసి
నిస్వార్థంగా నీ రక్తాన్ని
స్వేదంలా చిందించిన వెట్టిచాకిరి చేసిన...
నా నుండి ఏమీ ఆశించక...
నీ ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి...
అన్ని ఆశలు నా మీదనే పెట్టుకొని
నీ జీవితం మొత్తం నా కోసమే
ధారబోసిన...
ఖర్చు చేసిన...
కన్నుమూసిన...
ఖాళీ చేతులతో కాటికెళ్ళిన...
అమ్మా ఓ అమ్మా
నీ ఋణం ఎన్ని
జన్మలెత్తినా తీర్చలేనిది
నీవే మాకు ప్రత్యక్ష దైవం...
కలనైనా మరువక
అపురూపమైన
నీ త్యాగాన్ని...
స్వచ్ఛమైన నీ ప్రేమను...
మా కోసం అనుక్షణం
నీవు పడిన నీ శ్రమను...
చీకటిలో నీవు కార్చిన
ఆ కన్నీటి చుక్కలను...
నిత్యం గుర్తు చేసుకుంటాం
గుండెలో గుడి కట్టి
సదా నిన్నే స్మరించుకొంటాం
అందుకే అమ్మా ఓ అమ్మా
మీకు వందనం...అభివందనం...
పాదాభివందనం...
ఔను...
మా అమ్మ
గుండె ఆగింది...
మా గుండె చెదిరింది...
మా కంట కన్నీరు కరువైంది...
మా ఇంటి మామిడి చెట్టు మరణించింది...
మా ఇంటి వెలుగు మా కంటికి దూరమైంది.
స్వార్థానికి అర్థం తెలియని మా అమ్మ
స్వర్గంలో విశ్రాంతి......తీసుకుంటున్న
మా అమ్మ...ఆత్మకు శాంతి కలగాలని
ఆ అమ్మకిదే నా నిండు నీరాజనం...
ఆ పరమాత్మకిదే నా నిత్యనివేదన...



