Facebook Twitter
ఓ పాములపర్తి...మీ ఘనకీర్తి‌…

పేరు నరసింహుడైనా
ఉగ్రనరసింహుడు కాదు
ఉత్తర కుమారుడు కాదు
ఎన్ని ఉప్పెనలు వచ్చినా
ఉపాయాలతో అపాయాలను
ఓర్పు‌తో నేర్పుతో తప్పించుకునే
ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ!
ఓ నిగర్వీ!
ఓ పాములపర్తీ !...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

ముఖ్యమంత్రిగా
భూసంస్కరణల చట్టంచేసి
790 ఎకరాల సొంతభూమిని
దానం చేసిన ఓ దానకర్ణుడా...
ఓ దయార్ద్ర హృదయుడా!
ఓ పాములపర్తీ !...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

తమిళ పులుల రక్తదాహానికి
బలైన రాజీవ్ గాంధీ
తదనంతరం ప్రధానమంత్రి
పీఠాన్ని అధిరోహించి
9వ ప్రధానిగా ఢీల్లీఎర్రకోటపై

త్రివర్ణపతాకాన్నిఎగురవేసిన
ఓ  తెలంగాణా తెలుగుబిడ్డా !
ఓ పాములపర్తీ !...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

నాడు అంతర్గత విభేదాలతో

 ఆరిపోయేదీపంలా

మునిగిపోయేపడవలాంటి
మైనారిటీ ప్రభుత్వాన్ని
సుడిగుండాలకు చిక్కకుండా
నడిపి తీరం చేర్చిన
ఓ మాంత్రికుడా! ఓ తాంత్రికుడా! 
ఓ ఇంధ్రజాలికుడా!
ఓ పాములపర్తీ ! ...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

నాడు ఆర్థిక సంక్షోభంలో
కూరుకుపోయి తల్లడిల్లే
ఢిల్లీని ఒక తల్లిలా లాలించి ఆర్థికసంస్కరణలపాలిచ్చి
ఒడిలో చేర్చుకొని ఓదార్చిన
ఓ భరతమాత ముద్దుబిడ్డా!
ఓ జాతినేతా! ఓ స్పూర్తి ప్రదాతా! 
ఓ భాగ్యవిధాతా!
ఓపాములపర్తీ !...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

విదేశాంగ విధానంలో విప్లవాత్మకమైనమార్పులు

 తెచ్చి ప్రక్కలో బల్లేలైన శతృదేశాలకు

 స్నేహహస్తం అందించి
మిత్రదేశాలుగా మార్చిన
ఓ అపరచాణుక్యుడా!
ఓ పాములపర్తీ ! ...
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

తెల్లని పంచెకట్టు ఓ తెలుగోడా !
14 భాషలపై ఉడుంపట్టున్నవాడా !
స్పానిష్ భాషలో ఉపన్యాసం ‌చేసి
ఫెడరల్ కాస్ట్రోను అబ్బురపరచినవాడా!
ఇన్ సైడర్ నంటూ ఆత్మకథను వ్రాసుకొని
వేయిపడగలను హిందీలోకి అనువదించినవాడా!
ఓ బహుభాషా కోవిదుడా!
ఓ సరస్వతీ పుత్రుడా !
ఓ పాములపర్తీ ! ..
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి !

అవమానాలను అంతరంగాన...
కష్టాలను కనురెప్పల మాటున...
ప్రత్యర్థుల విమర్శల గరళాన్ని కంఠాన...
దాచుకున్న ఓ స్థితప్రజ్ఞుడా ! 
ఓ బోళాశంకరుడా !
ఓ పాములపర్తీ !.....
ఏమని పొగిడెద మీ ఘనకీర్తి!

ఓమౌనమునీ! ఓవిజ్ఞానగనీ!
ఓమానవీయా! ఓమహాత్మా!
ఓ అపరమేధావీ! ఓ ఆదర్శమూర్తీ !

 మీకిదేనా అక్షరాంజలి!
ఓ పాములపర్తి నారసింహా !
వందనం ! అభివందనం !
మీ స్మరణే ! ఓ ప్రేరణ !
మీకివే మా శతకోటి వందనాలు!