Facebook Twitter
ఉగ్రవాదం ...ఉక్కుపాదం

నిన్నమతం ఒక మత్తుమందు

నేడు ఆపేరు ఎత్తితేనే రక్తం చిందు

 

రాముడు కోరునా రక్తాభిషేకం లేదే

అల్లా కోరునా అల్లకల్లోలం లేదే

క్రీస్తు కోరునా కిరాతకం లేదే

మరెందుకు ఈ మారణహోమాలు

నిన్న జీహాద్ పేర జీవహింసలు

మొన్న రధయాత్ర పేర రక్తపాతాలు

నేడు మతబోధ పేర‌ మతమార్పిడులు

 

శాంతి శాంతి అంటూనే

సమరానికి సై అంటారా ?

అందరిని ప్రేమించాలంటూనే

అన్యం పుణ్యం ఎరుగని

అమాయకుల ప్రాణాలు తీస్తారా  ?

పవిత్రయుద్దం పేర ప్రజల తలల్ని

నరరూపరాక్షసుల్లా నడిరోడ్డులో నరికేస్తారా?

 

అత్యాధునిక

అణ్వాయుధాలున్నాయన్న అహంకారమా!

పాలునీళ్ళు ప్రవహించే చోట

రాక్షసత్వం రాజ్యమేలుతోందా !

రక్తదాహం తీరకుందా !

నరుల రక్తం ఏరులైపారేది

ఏకఛత్రాధిపత్యం కోసమేనా ?

ఇది ఎక్కడి నీతి ? ఇది ఎక్కడి ధర్మం ?

ఎక్కడ శాంతి ? ఎప్పుడు కాంతి ?

ప్రేమ భ్రమయేనా? శాంతి భ్రాంతియేనా?

 

అందుకే,

ఇక మతోన్మాదమే ఐతే మరో ఉగ్రవాదం 

ఉపేక్షించక మోపాలి దానిపై ఉక్కుపాదం