తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !!
కులం... ఒక కుళ్ళని
కడగడానికి చాలవు కడలిలో నీళ్లని
మతం... ఒక ముళ్ళని
బ్రతుకుబాటంతా గాయాలమయమని
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరుచుకో !!
పక్షులు వేలైనా... రెక్కలు రెండేనని
రంగులు వేరైనా... రక్తం ఒకటేనని
భాషలు వేరైనా... భావం ఒకటేనని
భక్తులు వేలైనా...భగవంతుడు ఒకడేనని
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరుచుకో !!
నిర్దయగా నిస్సిగ్గుగా నిర్మొహమాటంగా
నిలదీసి అడిగే ముందు నీకులమేదని
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
కులం గజ్జికుక్కని...తిరగనిస్తే తప్పని
మతం పిచ్చి మొక్కని...పెరగనిస్తె ముప్పని
నేస్తం ఎందుకు మనకీ భేదాలు ?
జగతికి ప్రగతికి ఇది కావా జాడ్యాలు
కాలి,కూలి పోవాలి ఈ కులమత కుడ్యాలు
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరుచుకో !!



