Facebook Twitter
అంబేద్కర్ అందించిన వజ్రాయుధం…

అన్నా..! ఓ ఓటరన్నా..!

ఓ పచ్చినిజం చెబుతా విను

కోదండరాముని నమ్మిన బంటైన

ఆ శ్రీ వీర హనుమాన్ కి

తనశక్తి తనకు తెలియదన్నట్లు...

నీకున్న... నీ ఓటుకున్న

ఆ "అఖండమైన శక్తి"

నీకు సైతం తెలియదాయె...

నీ చేతిలో ఉన్నది ఓటు కాదు

అద అంబేద్కర్ నీకు అందించిన 

ఒక త్రిశూలం...

ఒక రామబాణం...

ఒక వజ్రాయుధం...

ఒక పదునైన కరవాలం...

ఔను నీది ఏ దైవ స్వరూపమో ఏమో...

నీది ఏ దేవతాశక్తి ప్రతిరూపమో ఏమో...

మదించిన మాయమాటల

"మహిషాసురులను" 

...వధించడానికి...

కామపిశాచులైన రాక్షస 

"రావణాసురుల"పదితలలు" 

...తెగనరకడానికి...

నమ్మించి నట్టేటముంచే 

నాయక "నరకాసురులను" 

....మట్టుపెట్టడానికి...

గుర్తుంచుకునే 

..."గుణపాఠం" నేర్పడానికి...

నీలో సైతం

ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయి

అదృశ్యంగాఎన్నో చేతులున్నాయి

ఆచేతుల్లో ఎన్నో ఆయుధాలున్నాయి

రేపు నీవు ఎవరికి 

అమృతాన్ని పంచెదవో..?

ఎవరిపై విషం చిమ్మెదవో..?

ఎవరికి ఎరుక..? నీ చేతుల్లో

అదృశ్యంగా ఉన్న ఆయుధాలకు తప్ప...

నిన్ను చుట్టుముట్టిన...

ఆ సమస్యల సుడిగుండాలకు...

ఆ సునామీలకు తప్ప...

నీవు తీసుకునే నిప్పులాంటి 

ఆ నిర్ణయాలకు తప్ప...

 

కానీ అన్నా ఓ ఓటరన్నా... 

రేపు నీవిచ్చే ఆ తిరుగులేని తీర్పు...

తెస్తుందీ దేశంలో...

నీ ముందు జీవితంలో 

ఒక విప్లవాత్మకమైన వింత మార్పు...

అందుకే విజ్ఞతతో ఆలోచించు... 

ఆపద్బాంధవులకు అమృతాన్ని పంచు...