Facebook Twitter
దేవుని సన్నిధి..!నాకు గొప్ప పెన్నిధి..!

ఆ జీవము గల
దేవుడు నివసించే
ఆ మహిమగల
సుందర మందిరానికెళ్ళి
సర్వశక్తిమంతుడైన
ఆ సృష్టికర్తను...
కష్టాలను తీర్చే
కన్నీటిని తుడిచే...
మొండిరోగాల నుండి
స్వస్థత పరిచే...
ఘోరాతి ఘోరమైన
ప్రమాదాల నుండి
తెలిసీతెలియక చేసిన
పాపాలను
క్షమించే ప్రేమించే...

శాపాలనుండి
కరుణించి...
కాపాడి రక్షించే...
శిలువపై పరిశుద్ధ
రక్తాన్ని చిందించి...
మరణించి సమాధి
చేయబడి తిరిగి
మూడవ దినమున
మరణపు ముల్లును విరిచిన...
మృత్యుంజయుడై లేచిన ...
ప్రభువైన యేసుక్రీస్తు
తన కృపను కరుణా
కటాక్ష వీక్షణాలను...
దయాదాక్షిణ్యాలను...
ప్రేమానురాగాలను...
దివ్యమైన దీవెనలను...
శాంతి సమాధానాలను...
కుంభవర్షంలా
మీపై కురిపించి మురిపించే...

ప్రభువైన యేసుక్రీస్తును
ఘనంగా స్తుతించాలని...
నా "అధరాలు"...
గట్టిగా కేకలు పెట్టుచున్నవి...

నా "కళ్ళు"...
ఆ కరుణామయున్ని
తిలకించి పులకించి పోవాలని
కమ్మని కలలు కంటున్నవి...

నా "కరములు"...
ఆ దివ్యమంగళ
రూపాన్ని తనివితీరా తాకి...
క్షీరాభిషేకం చేయాలని... తహతహలాడుతున్నవి...

నా "పాదాలు"...
ఆ ప్రభువు
సన్నిధికి చేరాలని
ఉబలాటపడుతున్నవి...

నా మూగ "మనసు"...
మురిసిపోతున్నది
ముసిముసి
నవ్వులు నవ్వుతున్నది...

నా "హృదయం"...
పట్టారాని సంతోషంతో
ఆనందతాండవం చేస్తున్నది...

నా "చెవులు"...
ఆ ప్రభువు దివ్యనామామృతాన్ని
గ్రోలి తరించాలని నిరీక్షిస్తున్నవి...