కష్టాలను "కట్టగట్టి" "
సమస్యలను "చుట్టచుట్టి"
ఎద ఎదను "ప్రేమతో తట్టి" వ్రాయి
జంకు బొంకు లేకుండా
ఇష్టమనే ఇంకుతో కష్టమనే కలంతో
సృష్టికర్తను స్మరిస్తూ అదృష్టంపై కాక
నీ స్వశక్తి మీదనే "దృష్టిపెట్టి" వ్రాయి
కవిత్వం వ్రాయి "కాలమనే కలం పట్టి"వ్రాయి
జీవితమనే కాగితం మీద "మనసు పెట్టి" వ్రాయి
అవినీతి అక్రమాలపై "నిఘా పెట్టి"వ్రాయి
చెడును చీల్చిచెండాడి "కొరడాలతో కొట్టి" వ్రాయి
నిరుపేదల కన్నీటి కడలికి "ఆనకట్టలు కట్టి" వ్రాయి
బానిసబ్రతుకులు బ్రతికే వారి "భుజాలు తట్టి"వ్రాయి
జేగంటను మోగిించి గుండెగుండెను తట్టి" రాయి
జయహో జయహో అనే నినాదంతో "జై కొట్టి "వ్రాయి
నిన్ను వెంటాడే ఓటమిని "గంగలోకి నెట్టి" వ్రాయి
సమాజంలోని రుగ్మతలను "సమాధిలోకి నెట్టి" వ్రాయి
ముత్యాల్లా మెరిసేటి అక్షరాలను "ముద్దు పెట్టి" వ్రాయి
శత్రువుల్ని భయపెట్టి "నీమిత్రుల్ని సంతోష పెట్టి" వ్రాయి
కదిలే అలను కరిగే కలకు "జతకట్టి" వ్రాయి
మంచికి మానవత్వానికి నుదుట "బొట్టుపెట్టి" వ్రాయి
నీ వేదైనా వ్రాయి కానీ అది
అణగారిన వర్గాలకు ఆశాకిరణం కావాలి
అజ్ఞానపు ఆకలితో ఉన్నవారికి అమృతం కావాలి
ఊపిరాడని బోరుబావి బ్రతుకులకు ఆక్సిజన్ కావాలి



