ఓ కవీ !
కవిత అంటే...
కవిత్వమంటే...
ఒక కొత్త కట్టడం...
మందు కనిపెట్టడం...
సమాజంలోని
రుగ్మతల్ని రూపుమాపడం...
దూరాచారాలను
దుర్మార్గాలను మట్టుపెట్టడం...
ఉడుకునెత్తురుతో రగిలే యువతను
చైతన్య వంతుల్ని చేయడం...
సుఖజీవన సూత్రాలను లిఖించడం...
మనిషి పురోగతికి పునాదులు వేయడం...
ఆత్మ గౌరవంతో జీవవించే
దారుల్ని అణ్వేషించడం...
కులమత రహిత స్వేచ్ఛాయుత
సమాజాన్ని సృష్టించడం...
ఆత్మను అక్షరముతోఆవిష్కరించడం...
మనుషుల్లో పెనుమార్పును
సంఘంలో భారీసంస్కరణలు తేవడం...
ఓ కవీ ! కవిత్వమంటే
పసందైన పదునైన పదాల పొందిక...
అందమైన అనుభవాల అక్షరాలతో కూర్పు...
ఓ కవీ ! ఆలోచన పుట్టగానే పెన్నుపట్టి వ్రాయకు
క్లుప్తతకు పెద్దపీట వేయాలి...అందమైన
ఊహకు బంగారు భావాలరెక్కలు తొడగాలి
భాషా నైపుణ్యముతో సొగసులు అద్దాలి
లోతైన అధ్యయనంతో సుందరశిల్పం సాధ్యమే
చూస్తే అందంగా ఉండాలి చదివితే మనసు కదలాలి
తింటే ఆకలి తీరాలి...వింటే మనసు సేద తీరాలి
ఓ కవీ ! రుద్దు రంగులద్దు దిద్దు మెరుగులు దిద్దు
తొందర వద్దు అలాగని ఆలస్యం చేయవద్దు,కారణం
ఆలోచనలు దీపాల్లా ఆరిపోతాయి మారిపోతాయి
ఒకటికి రెండుసార్లు కాదు వందసార్లు ఆలోచించి
అనుకున్న భావాన్ని అందంగా చెప్పడానికి
పదాలకు పదును పెట్టి రంగు, రుచి, వాసనలద్దాలి
భాషకు భావానికి కొత్తదనంతో చిగురులు తొడగాలి



