మొన్న...అన్నా ఓ రైతన్నా !
నీవే ఆకలితీర్చే అన్నదాతవంటే
పొయ్యి మీది పాలలా రైతన్న పొంగిపోయాడు
నిన్న...అన్నా ఓ రైతన్నా !
నీవే ఈ దేశానికి వెన్నెముకంటే...
పచ్చని పైరల్లే రైతన్న ముచ్చట పడిపోయాడు
ఆ ముచ్చట మూన్నాళ్ళేే...ప్రతిరైతు కంటినిండా కన్నీళ్ళే....
కారణం...అటు కల్తీ విత్తనాలతో కల్తీఎరువులతో
కల్తీ పురుగుమందులతో దళారీల దగ...
ఇటు అతివృష్టితో అనావృష్టితో అకాలవర్షాలతో ప్రకృతిపగ
అటు నీటమునిగిన పంటనుచూసినివ్వెరపోయిన రైతన్న...
ఇటు అప్పుల నిప్పులవాన కురిసికుప్పకూలిన రైతన్న...
గుండెపగిలి కడుపుమండి కన్నీరు పెడుతుంటే...
గిట్టుబాటుధర లేక గిలగిల కొట్టుకుంటుంటే...
ఆస్తులెన్నున్నా అనునిత్యం ఆకలికిఅలమటిస్తుంటే...
ఆత్మహత్యల గురౌతుంటే... ఆకలి చావులకు బలౌతుంటే...
ఆదుకున్న నాథుడేలేడు ఆదరించిన నాయకుడేలేడు
నేడు "పెనం మీద నుండి పొయ్యిలో "పడినట్లు
"మూలిగే నక్కమీద తాటికాయ" పడినట్లు,
అదిగో ముంచుకొస్తోంది మూడు చీకటిచట్టాల "ముప్పు "
ఓ రైతన్నలారా ! నిద్రమేల్కొండి !
ఇకనైనా నిజం తెలుసుకోండి!
మీకు కొడవళ్ళుపట్టి కొయ్యడం తెలుసు
మీకు కలుపుమొక్కల్ని వేరెయ్యడం తెలుసు
ఓ రైతువీరులారా ! రండిరండి ! కలిసిరండి !
కదలిరండి ! ఏకంకండి! దీక్ష బూనిసాగండి ! !
భయపడకండి ! యుద్దానికి సిద్ధంకండి !
ధిక్కారస్వరంతో హక్కులను కాలరాసె
పాషాణహృదయులైన పాలకులను ప్రశ్నించండి !
ప్రతిఘటించండి ! ఉరుములా ఉరమండి !
మెరుపులా మెరవండి ! ఉగ్రులై ఉద్యమించండి !
రైతన్నల రక్తాన్ని జలగలా పీల్చే ఆమూడు
రాక్షసచట్టాలను రద్దుచేసేంతవరకు విశ్రమించకండి !
(రైతన్నల ఉద్యమానికి మద్దతుగా.... నా అక్షరహారతి)



