Facebook Twitter
రక్తపు చుక్కలు రాల్చేదెవరు?

పొలంలోసేద్యం చేస్తూ పంట పండిస్తూ

రైతు చిందిస్తాడు "చెమట చుక్కలు"

 

కొండమీద బండరాళ్లు బ్రద్దలు చేస్తూ

శ్రామికుడు చిందిస్తాడు "చెమట చుక్కలు" 

 

వంటగదిలో రుచికరమైన

ఘుమఘుమలాడే వంటలు  

చేస్తూ అమ్మ చిందిస్తుంది "చెమట చుక్కలు"

 

కష్టపడి ఇష్టపడి శ్రమపడి కవి

కావ్యాలు వ్రాస్తూ ఖర్చుచేస్తాడు "సిరా చుక్కలు" 

 

ఒక సమతావాది, ఒక మానవతావాది

ఒక సంఘసంస్కర్త ఈ సభ్యసమాజంలో

దుష్టత్వం దుర్నీతి పెరిగి మానవీయ విలువలు

మంటకలిసినప్పుడు కారుస్తాడు"కన్నీటి చుక్కలు"

 

దేశ క్షేమం కోసం, దేశ భద్రత కోసం

రాత్రింబవళ్ళు సరిహద్దుల్లో పహారా కాస్తూ 

సైనికుడొక్కడే రాలుస్తాడు ఈనేలపై"రక్తపు చుక్కలు"