Facebook Twitter
ఓ కవీ ఏమిటి నీకర్తవ్యం ???

ఓ కవి నీ కలాన్ని "హలంగా" మార్చి

సాహితీ క్షేత్రంలో "సేద్యం"చేసి

సమాజంలోని రుగ్మతలకు "వైద్యం"చేసి

పదకవితలతో పద్యాలతో

కళామతల్లికి "నైవేద్యం"పెట్టిననాడే

మీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం

కవిగా సాహితీలోకంలో ధ్రువతారగా

చరిత్రలో సువర్ణాక్షరాలతో

నీ పేరు లిఖించబడుతుంది

 

"తరతరాలుగాా"

"అవివేకం అజ్ఞానం"

"అమాయకత్వమే వరాలుగా"

బానిసత్వపు బ్రతికే బంగారుమయంగా

అవివేకంలో అజ్ఞానంలో అంధకారంలో

బ్రతుకుబండి నీడ్చే బడుగుజీవులకు

పీడిత తాడిత బడుగు బలహీనవర్గాలకు

నీవు కొండంత అండగా ఉండాలి

 

నివురుగప్పిన నిప్పులాంటివారిని

చైతన్యవంతుల్ని చేయాలి

ఖణఖణమండేనిప్పు కణికలుగా మార్చాలి

వారి జీవితాల్లో కమ్ముకున్న చిమ్మచీకట్లను

నీ కవితా కరవాలంతో చీల్చి వేయాలి

వారి గుండెలనిండా పండువెన్నెల్ని నింపాలి

వారి జీవితాలకు భరోసా నివ్వాలి

 

నిర్భయంగా నిశ్చింతగా ప్రశాంతంగా

సుఖజీవనం చేసేలా

సులభమైన మార్గాలను అన్వేషించాలి

నాటి నేటి జీవన స్థితిగతులను

లోతుగా అధ్యయనం చేయాలి

నిప్పులాంటి నిజాలను వెలికితీయ్యాలి

వారి బానిసత్వపు బ్రతుకుల్లో

నవ్వుల పువ్వులు పూయించాలి

 

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు

సమానత్వం సౌభ్రాతృత్వంల విలువలు

రాజ్యాంగ రక్షణలు

కోల్పోయిన హక్కులు తిరిగి పొందేలా

అందరినీ సంఘటిత ‌పరచాలి

ఆత్మగౌరవమే వారికి "ఆయుధంలా"

ఆత్మవిశ్వాసమే వారికి "ఆక్సిజన్ గా"

ఆత్మబలమే వారికి "అమృతంలా" అందివ్వాలి

వారి గుండెల్లో చిరస్థాయిగా నీవు నిలిచిపోవాలి

ఓ కవి ఇదే నీ కర్తవ్యం నీ బాధ్యత నీ ఆశయం కావాలి

అరుణోదయకిరణమై నిరుపేదల జీవితాలను వెలిగించాలి