Facebook Twitter
అన్నదానం కన్న విద్యాదానమేమిన్న...

జన్మనిచ్చిన 

అమ్మా నాన్నలు

బ్రతికి వున్నంతకాలం

రెక్కలు ముక్కలు చేసి 

ఆస్తులు ఆర్జించినంతకాలం

 

ఎప్పుడూ 

ఘాటుగా తిట్టడం

బయటికి నెట్టడం

కసిరివిసిరి కొట్టడం

బాధ పెట్టడమే తప్ప

చిరునవ్వుతో ఆప్యాయతతో

ప్రేమతో పలకరించిందీ లేదు

 

కన్నందుకు తగినంత గౌరవం 

వీధిలో విలువ ఇచ్చిందీ లేదు

కడుపునిండా తిండి పెట్టిందీ లేదు

కాళ్ళకు ఏనాడూ మ్రొక్కిందీ లేదు

 

ఆర్జించిన ఆస్తినంతా లాక్కొని

అందరూ బ్రతికేవున్న, ఎవరూలేని 

ఏమీలేని అనాధలను చేసి,ఆకలికి 

అలమటించే అస్థిపంజరాలను జేసి

 

కాలం తీరగానే 

కరుణామయుడైన 

ఆ పరమాత్మ నుండి 

రమ్మని పిలుపొచ్చి

కన్ను మూసి కాటికెళ్తుంటే

కడవలకొద్దీ ఈ కన్నీరెందుకు?

వారి తీపిజ్ఞాపకాలతో బ్రతికితే చాలదా

 

అంత్యక్రియలంటూ 

ఆర్భాటంగా ఈ అన్నదానాలెందుకు?

వీధిలో బాలలకింత విద్యాదానంచేస్తే మేలుగదా

అందమైన సుందరమైన 

అతి ఖరీదైన ఆ పాలరాతి సమాధులెందుకు?

నిలువ నీడలేని నిరుపేదలకింత

గూడునేర్పాటు చేస్తే చాలదా మీ బ్రతుకుధన్యం కాదా

ఆలోచించండి మేధావులారా! వివేకులారా! విజ్ఞులారా!