Facebook Twitter
ఆ "మూడు" సమయాలు 

ఆ సమయం 

అత్యంత ఆనందకరమైనది 

- అదే నీ జననం

అప్పడు మీ అమ్మనాన్నల 

ఆనందం వర్ణనాతీతం

నిన్ను చూసి మురిసిపోతారు  

ముద్దులాడుతారు

ముసిముసినవ్వులు నవ్వుతారు

బంధువులు మిత్రులు అభినందిస్తారు

సంతోషంతో అందరూ 

సంబరాలు చేసుకుంటారు

ఒక్క నీవు తప్ప కారణం,

"అప్పుడే నీవు కళ్లు తెరిచావు" కాబట్టి

 

ఆ సమయం 

అత్యంత శుభకరమైనది, 

ఎంతో మధురమైనది, మంగళకరమైనది

- అదే నీ వివాహ మహోత్సవం 

నీవు కన్న కలలన్ని నిజమైనరోజు 

ఒంటరిగా వున్న నీవు జంటగా మారినరోజు

జతగా నీకు మరొకరు వెంట వచ్చినరోజు

అది రెండు మనసులు ఏకమైనరోజు  

రెండు కుటుంబాలు ఒక్కటైనరోజు 

ఏడడుగులు నడిచిన రోజు

పచ్చని పెళ్ళిపందిరిలో అందరూ

పక్షుల్లా స్వేచ్చగా తిరుగుతున్నరోజు

ఒక్క నీవు తప్ప కారణం,

అప్పుడే నీవు మూడు ముళ్ళువేశావు" కాబట్టి 

 

ఆ సమయం 

అత్యంత విషాదకరమైనది

- అదే నీ ఆకస్మిక మరణం 

నీ భార్యాబిడ్డలు బంధువులు మిత్రులు 

నీవుదూరమై పోయినందుకు దుఖిస్తారు  

కాసేపు కన్నీరు కారుస్తారు 

ఆపై నిన్ను కాటికి చేరుస్తారు 

దహనం లేదా ఖననం చేస్తారు 

విషాద వదనాలతో వీడ్కోలు పలుకుతారు 

నీవు మిగిల్చిన నీ తీపి ఙ్నాపకాలను 

గుర్తు చేసుకుని అందరూ కుమిలిపోతారు

ఒక్క నీవు తప్ప కారణం,

"అప్పుడే నీవు కన్ను మూశావు" కాబట్టి