మనస్పర్థలకు మందులు...
ఎదురింట్లో అరుపులు కేకలంటే
ఇరుగుపొరుగు వారికెంతో ఇష్టం
గొడవలు పడుతుంటే భార్యాభర్తలు
గోడలో చెవులు దూర్చి వింటారు
చిలికి చిలికి గాలివానౌతుంటే
తెగ సంబరపడిపోతారు
తగవులు తీర్చకపోగా
సూటిపోటి మాటలతో
అగ్గిలో ఆజ్యం పోస్తారు
గుసగుసలాడుకుంటారు
చెవులు కొరుక్కుంటారు
చిరునవ్వులు నవ్వుతారు
సంతోషంతో చిందులువేస్తారు
కాని,కొందరు భార్యాభర్తలు
ప్రతినిత్యం కాసేపు పోట్లాడుకోకపోతే
వారికి పొద్దుపోదు అదివారి వక్రబుద్ధి
కొద్దిసేపు రుసరుసలాడుతారు
రుద్రరూపం దాలుస్తారు
మరుక్షణంలో సరసాలాడుతారు
సరదాగా సంక్రాంతి
సంబరాలు చేసుకుంటారు
కొద్దిసేపు బద్దశతృవుల్లా
కసిగాకసిగా కత్తులు నూరుకుంటారు
మరుక్షణంలో మంచమెక్కి
దుప్పటిలో దూరిపోతారు
బిగికౌగిలిలో బంధీలైపోతారు
కానీ, కొందరు భార్యాభర్తలు
తిట్టుకుంటున్నారో పొగుడుకుంటున్నారో
నవ్వుతున్నారో ఏడుస్తున్నారో
అసలు వారు భార్యాభర్తలా లేక ఫ్రండ్సా
అర్థంకాక ఇరుగుపొరుగువారు మాత్రం
బుర్ర గోక్కుంటారు జుట్టు పీక్కుంటారు
ఏదేమైనా,
అర్థంకాకుండా ఉండేదే అసలైన జీవితం
గుట్టు విప్పితే ఏముంది అంతా విషాదం
ముఖాముఖి చర్చలు మనస్పర్థలకు మందులే
ఆ లౌక్యమెరుగని భార్యాభర్తలందరూ అంధులే



