రాత్రిచక్కగా నవ్వుతూ పలకరించి
తెల్లవారేసరికి మనుషులు
మాయమైపోతున్నఈ కరోనా కాలంలో
అంత ఖరీదైన బైకు అవసరమా ?
మనిషి ఆశకు అంతేది?
విలాసాలకు కులాసాలకు
అలవాటు పడినవారు
పదిమందిలో నేను గొప్ప అనుకునేవారు
తిన్నదెట్లో అరగనివాళ్ళు
ఉన్నదెట్ల ఖర్చు చేయాలో ఎరగనివాళ్ళు
ఆ బైకు ఎక్కే ముందు
రాత్రి పడుకునే ముందు ఒక్కసారి
ఆకలికి అలమటించే ఆ అనాధల గురించి
ఉపాధిలేని ఆ వలస కూలీల గురించి
నీడలేని ఆ నిరుపేదల గురించి
ఆసుపత్రుల్లో కళ్ళు తిరిగే బిల్లుల్ని
కట్టలేని ఆ మధ్యతరగతి ప్రజల గురించి
ప్రతిభవుండి విద్యను మధ్యలోనే
ఆపేసిన ఆ విద్యార్థుల గురించి
అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు
చేసుకునే ఆ రైతన్నల గురించి
కాస్త ఆలోచిస్తే మంచిది కదా
వారి జన్మ ధన్యముకదా
పోతూపోతు మూటకట్టుకు పోయేదేముంది?
చేత పట్టుకు పోయేదేముంది?
ఆ బైకులోని ఒక బోల్టునుకూడ వెంట
తీసుకెళ్ళలేరన్న ఒక పచ్చినిజం
ఎప్పుడు తెలుసుకుంటారో ఈ పిచ్చిజనం.



