ఏమండీ కాస్త - యోగా చేయండి
టైం లేదు బిజీ
ఏమండీ టిఫిన్ రెడీ - చేసి వెళ్ళండి
సారీ టైం లేదు బిజీ
ఏమండీ వెళ్లి - కరెంట్ బిల్లుకట్టిరండి
నో వెరీ సారీ వెరీ బిజీ
ఏమండీ ఈ రోజు ఈవినింగ్ -
డాక్టర్ దగ్గరికి వెళ్దాం
నో చెప్పేది నీకు కాదు
టైం లేదు బిజీ బిజీ అని ఎన్నిసార్లు
కసురుకున్నా విసురుకున్నా
నీ మాట వినకున్నా
నిన్ను పట్టించుకోకున్నా
ఏనాడు కోపపడినట్లు కానీ
తిడితే తిరిగి తిట్టినట్లు కానీ
దాఖలాలు లేవు
ఊపిరాడకుండా ఆఫీసులో బిజీగా ఉంటే
ఉద్యోగ ధర్మమని ఊరుకున్నావు
కాస్త టైం దొరికితే కవితలల్లుకుంటూ
కూర్చుంటే ఏదో హాబీలే అని
సరిపెట్టుకున్నావు
ఏనాడైనా ఏదైనా పార్కుకో పార్టీకో
హోటల్ కో సినిమాకో షికారుకో
తీసుకుపోలేదని అలిగిన దాఖలాలు లేవు
పిల్లల ఫీజులు నుండి
ముసలివాళ్ళ మందుల వరకు
ఇంటి పనులన్నీ ఒంటిచేత్తో చేసుకున్నావు
ఏనాడు నాకు ఇంత కూడా సహాయపడలేదని
నాపై నిందలు వేసిన దాఖలాలు లేవు
ఎంతటి ఓర్పు ?ఎంతటి నేర్పు?
ఎంతటి సహనం ?ఎంతటి సర్దుబాటుగుణం?
భర్తంటే ఇంతటి ప్రేమా ? ఇంటి ఇంత గౌరవమా ?
ఇట్టి భార్య నిజంగా భగవంతుని బహుమతే
అప్పుడప్పుడు మనం ఓకే ఇయర్ ఫోన్ లో
ఈ పాటలు విని పడుకునేవాళ్ళం,గుర్తుందా
"నీమది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో, వేదన మరచిపో
నీ మది చల్లగా
ఏ సిరులు ఎందుకో
ఏ సౌఖ్యములెందుకో
ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు
నరకమౌను మనసు తనది కానిదే
నీమది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో "....
"ఎన్నో నోములే గతమందు నోచివుంటా
నీకే భార్యనై ప్రతిజన్మ నందు ఉంటా,
నడిచే దైవమా
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు"... ,
అంటూ ఇంతకాలం నాతో ఉన్నందుకు,
నన్ను భరించినందుకు నాతో కలిసి
జతగా జర్నీ చేసినందుకు, ప్రేమతో
ఓ చిరునవ్వుల శ్రీమతి - నీ కిదే నా అక్షర హారతి...



