Facebook Twitter
మీ శ్రీమతి మీకొక బహుమతి…

ఆమె ఆతిథ్యం 

అతి రుచికరమైనది 

మధురమైనదిమరుపురానిది

ఆమె ఇచ్చే చక్కనైన

అన్ని సలహాలు ఆణిముత్యాలే

 

ఆమె ఉత్సాహం 

ప్రోత్సాహం వెయ్యేనుగుల బలం

ఆమె అభిమానం 

అందుకోవడం ఎంతటి అదృష్టమో

 

ఆమె ఇతరులకిచ్చే గౌరవం 

అంతులేనిది అతి విలువైనది

ఆమె లౌకికం 

చాకచక్యం అంతు చిక్కనిది

 

ఆమె భక్తిభావం 

అపారం నిజం నిత్యనూతనం

ఆమె అనురాగం ఆప్యాయత 

అమృతంతో సమానం

 

ఆమె కోపం క్షణికం 

ఒక నీటిబుడగ లాంటిది

ఆమె శాంతం 

సముద్రం కన్న లోతైనది

 

ఆమె స్నేహానికి 

చక్కని చిరునామా

ఆమె మనసు నిర్మలమైనది

నిశ్చలమైనది నిష్కల్మషమైనది

 

ఆమె ఆలోచనలు ఊహలు 

అభివృద్ధికి సోపానాలు

ఆమె సమయస్ఫూర్తి 

అత్యద్భుతం ఆశ్చర్యకరం

 

ఆమె ఉచిత సలహాలు 

పాటిస్తే ఉజ్వల భవిష్యత్తే  

ఆమె సేవాభావం 

దయాగుణం సదా ఆచరణీయం

 

ఆమె దూరదృష్టి గలది 

ప్రతిది లోతుగా పరిశీలిస్తుంది

ఆమె పట్టుదల 

పట్టిందంటే సాధించి తీరుతుంది

 

ఆమె‌ సర్దుబాటుగుణం 

సహనం సముద్రమంత

ఆమె మంచితనం 

మానవత్వం ఆకాశమంత

 

ఆమె ప్రేమతత్వం 

మదర్ థెరిస్సానే మరపిస్తుంది

ఆమె క్షమాగుణం 

కరుణామయున్నే గుర్తుచేస్తుంది

 

ఆమె కలుపుగోలుతనం 

ఆమెకు భగవంతుడిచ్చిన 

ఓ బంగారు వరం

ఆమె ఓర్పు నేర్పు 

అందరిలో తెస్తుంది గొప్ప మార్పు

 

ఆమె మీ కంటికి ఒక ఆశాజ్యోతి

ఆమె మీ ఇంటికి ఒక ఆరని దీపం

ఆమె ఎవరోకాదు ప్రేమకు ప్రతిరూపమైన మీ శ్రీమతి

ఆమె భగవంతుడు మీకిచ్చిన ఓ బంగారు బహుమతి