Facebook Twitter
అమ్మేఅమ్మలు - అంగడిబొమ్మలు

అయ్యో ! అయ్యో !

పాపం ఆ పసికూనలు! 

అన్యంపుణ్యం యెరుగని 

ఆ అమాయకులు! 

పాపంపుణ్యం తెలియని 

ఆ పసిబిడ్డలు!

ఏ చిన్నచిరునవ్వుకో

ఏ మాయదారిమాటకో 

ఏ చిన్నచాక్లెట్ కో 

ఏ మిల్కీబిస్కట్ కో 

ఆశపడి, మోసపోయి 

నమ్మి వెంటపోయి పాపం 

నరకకూపంలోకి నెట్టబడ్డారే 

 

మానవత్వంలేని 

మృగాలచేతిలో చిక్కి 

దారుణమైన చిత్రహింసలకు గురై 

వావివరసలు,వయసుతేడాలులేని

కామాంధులకౌగిళ్ళలో 

పువ్వుల్లా నలిగిపోతున్నారే !

 

పిల్లలు తప్పిపోయారని వెతికివెతికి 

పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగితిరిగి 

అక్కడ తల్లిదండ్రులు రాత్రింబవళ్ళు

కుమిలిపోతూ కన్నీరుమున్నీరౌతుంటే 

 

ఇక్కడ పిల్లలు ఆకలికి అలమటిస్తు

అంగడి బొమ్మలై అమ్ముడు పోతుంటే

ఏమిచెయ్యాలోఎవరికి చెప్పుకోవాలో 

ఈ నరకకూపం నుండెలా బయటపడాలో

ఈ దుష్టులనుండి దుర్మార్గులనుండి ఎలా

తప్పించుకోవాలో తెలియక పాపం

పంజరంలో చిక్కుకున్న పక్షుల్లా

వలలోచిక్కిన చేపల్లా గిలగిలలాడే 

ఆ పసివాళ్ళను ఆదుకునే వారేలేరా?

 

గుట్టమీద గుట్టుగా వారితో 

వ్యాపారం చేయించి లక్షలార్జించే

ఈ మాయదారి అమ్మానాన్నలను

ఈ నీచులను, ఈ రాక్షసులను

ఈ మానవమృగాలను శిక్షించేదెవరు? 

వారిబారి నుండి వీరిని రక్షించేదెవరు ?

 

నిద్రపోతున్న అవినీతి అధికారుల్ని 

మేల్కొలిపేదెవరు ? ఈ దగాకోరులపై

నిఘాపెట్టని ప్రభుతాన్ని నిలదీసేదెవరు ?

నిరసన ర్యాలీలు ఉద్యమాలు చేసేదెవరు ?

ఈ ఘోరాన్ని ఈ దుర్మార్గాన్ని 

ఈ అరాచకాన్ని అరికట్టేదెవరు ?   

ఎవరు?ఎవరు ?ఎవరు ?ఇంకెవరు యువతే!