వేదభూమిలో ఏమిటి?
ఈ వేదనలు ఈ వ్యధలు
ఈ వేధింపులు అణగారిన
స్త్రీజాతి రోదనలకు అంతేలేదా?
ఎందుకు ఎందుకు
ఈ దారుణాలు ?
రహస్య ప్రణాళికలు
రచించే రాక్షసులెవ్వరు ?
ఎవరి అండ చూసుకొని
దళితుల మహిళలపైనే
ఈ దారుణమైన దాడులు
ఈ సభ్యసామాజంలో
ఆడపిల్లలకన్నా ఆకాశంలో పక్షులే
స్వేచ్ఛగా విహరిస్తున్నాయే
ఇదేనా ప్రజాస్వామ్యం ?
ఇదేనా ప్రజారాజ్యము ?
ఇదేనా రామరాజ్యము ?
కాదు కాదిది రావణకాష్టం
ఇదేనా సభ్యసమాజం ?
కాదు కాదిది మానవమృగాలైన
కామాంధులు తిరిగే కారడవి
రాజ్యాంగం మనకు
రక్షణ కవచమన్నారే,ఏది
ఆడపిల్లలకు రక్షణ ఏది ?
ఓ అమ్మల్లారా ! ఓ తల్లుల్లారా !
మీరు మనుషులను కన్నారా?
మానవ మృగాలను కన్నారా ?
పడుచు పిల్లలు కనిపిస్తే
పశువుల్లా ప్రవర్తిస్తున్నారే
ఎక్కడ ఎక్కడ విన్నా
గుండెలను పిండేసే
హత్రాస్ సంఘటనలే
ఎక్కడ ఎక్కడ చూసినా
చట్టాలు మా చుట్టాలంటూ
పట్టపగలే పచ్చినెత్తురు త్రాగే
ప్రాణాలు తీసే గూండాల
విచ్చలవిడి వీరవిహారాలే
ఎందుకు ఎందుకు బడుగు
బలహీన వర్గాల మహిళలపైనే
ఈ దారుణమైన ఈ ఘోరమైన
ఈ అమానుషమైన కిడ్నాపులు
ప్రాణభయంతో ఎదురుతిరిగితే
చిత్రహింసలకు గురిచేయడాలు
ఈ సామూహిక మానభంగాలు
ఈ కౄరమైన యాసిడ్ దాడులు
ఈ నాలుకలు తెగకోయడాలు
ఈ పెట్రోలుపోసి తగలపెట్టడాలు
ఎక్కడుంది లోపం?
అంధులైన అధికారుల్లోనా?
అసమర్థులైన పాలకుల్లోనా ?
వారిని గద్దెనెక్కించిన
అమాయకపు జనంలోనా?
ఔను ఒక బలమైన ప్రభుత్వానికి
పునాదిరాళ్ళు బలహీన వర్గాలే అన్నారు
కానీ,బ్రతుకుల్ని బుగ్గిపాలు చేస్తే ఔతాయి
ఆ పునాదిరాళ్ళే రేపు మీకు సమాధిరాళ్ళు



