Facebook Twitter
అగ్గిపిడుగు అల్లూరి

పులిలా గర్జించి
గజరాజులా ఘీంకరించి
సింహంలా పంజావిసిరి
తెల్లదొరలను గడగడలాడించి
వారి పాపపు పొరలను
విషపు కోరలను విరిచిన
"విప్లవవీరుడు"
స్వాతంత్ర్య సమరయోధుడు
మన అల్లూరి సీతారామరాజు

అడవినే దైవంగా భావిస్తూ
పుడమినే తల్లిగా పూజిస్తూ
పోడువ్యవసాయం చేసుకుంటూ 
పొట్టనింపుకుంటూ
చింతఅంబలి త్రాగిబ్రతికే
అమాయకపు అడవిబిడ్డలపై
అక్రమంగా పన్నులు విధిస్తూ
మహిళలపై అత్యాచారాలు చేస్తూ
దోపిడిలు దౌర్జన్యాలతో
చిత్రహింసలకు గురిచేస్తూ
వారి హక్కులను కాలరాసే
తెల్లకుక్కలపై నిరసనల
నిప్పులవర్షం కురిపించి
విల్లనంబులతో విరుచుకుపడిన
"మన్యం వీరుడు"మగధీరుడు
మన అల్లూరి సీతారామరాజు

ఈ దేశప్రజలకు
స్వేచ్ఛాస్వా‌తంత్ర్యాలు
సాయుధ పోరాటాలతోనే
సాధ్యమని నమ్మి
భరతమాత దాస్యశృంఖలాలు
తెంచేందుకు
రవిఅస్తమించని బ్రిటిష్
సామ్రాజ్యాన్ని ఎదిరించి
తెల్లవారి గుండెల్లో నిదురించి
విప్లవ శంఖం పూరించి
వీరోచితంగా పోరాడుతూ
కుట్రలు కుతంత్రాలుపన్ని
చుట్టుముట్టిన బ్రిటిష్ సేనలు
చెట్టుకు కట్టేసి కసితో
గుండెల్లో కాల్చినప్పుడు
వందేమాతరమంటూ
దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ
నేలకొరిగిన "అగ్గిపిడుగు"‌
"భగ్గుమన్న భాస్కరుడు'
మన అల్లూరి సీతారామరాజు
అట్టి అమరజీవికి ఆ ఆదర్శమూర్తికిదే
నా అశ్రునివాళి విప్లవాభివందనాలతో...
జెండా