Facebook Twitter
అప్పడిగారికి అక్షరాభివందనం

ఆడిన మాట ఎన్నడు తప్పడు- గుట్టు అంటూ వుంటే విప్పడు
గొప్పలు ఎప్పుడూ చెప్పడు- ఆరునూరైనా మడిమ తిప్పడు
వారే వారే అప్పడు గారు -వారి తీరే వేరు -వారికెవరూ పోటీ లేరు
చెప్పండి ఎవరి కంటే ఎవరు గొప్పండి
అంటూ వుంటారు మన అప్పడు గారు
అప్పుడప్పుడూ ఎవరైనా ఎదురు పడినప్పుడు
దళిత ఉద్యోగులెవ్వరూ దగాకోరులు కాదని
దండగమారి మనుషులు అసలే కాదని
వారెంతో ధైర్యవంతులని దయార్థహృదయులని
కరుణామయులని కష్ట జీవులని
అంటూ వుంటారు మన అప్పడు గారు
అప్పుడప్పుడూ ఎవరైనా ఎదురు పడినప్పుడు
ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా
పూజకు బలివ్వరు పులుల్నిసింహాల్ని
ఆకులు మేసే అమాయకపు మేకల్నితప్ప
అందుకే ఎండు గడ్డికెప్పుడూ ఆశించకండి
గడ్డి కరవని పులులై గాండ్రించండి
అంటూ వుంటారు మన అప్పడు గారు
అప్పుడప్పుడూ ఎవరైనా ఎదురు పడినప్పుడు
అంటరాని కులం లో పుడితేనేం మనం అగ్గిపుల్లలం
పూరి గుడిశలో పుడితేనేం మనం పులిపిల్లలం
కానీ మనం అస్పృశ్యులమంటూ
ఎవరూ వెంటరాని ఒంటరివాళ్ళమంటూ
ఎప్పుడూ కంటతడి పెట్టుకోకండి
కులసర్పాలు విషం గ్రక్కుతున్నాయని
కుమిలిపోకండి కృంగిపోకండి
ప్రమోషన్లు ఇక పొందలేమంటూ
అధికారం ఇక అందుకోలేమంటూ
దిగులు పడకండి దిక్కులు చూడకండి
అంటూ వుంటారు మన అప్పడు గారు
అప్పుడప్పుడూ ఎవరైనా ఎదురు పడినప్పుడు
అసలు అధికారం అన్నది అందని ద్రాక్షే కాదని
ప్రమోషనన్నది మనం పొందలేని విందు కాదని
ఎగిరేవాడే ఏరోజైనా ఏదైనా అందుకుంటాడని
మెట్లు ఎక్కేవాడే మేడపైకి చక్కగా చేరుకుంటాడని
ఏటికి ఎదురీదేవాడు చేరలేని తీరమే లేదనీ
ఎర్రని ఎండలో రెక్కలు ముక్కలు చేసేవాడు
ఎక్కలేని శిఖరమే లేదనిఅంటూ వుంటారు మన అప్పడు గారు
అప్పుడప్పుడూ ఎవరైనా ఎదురు పడినప్పుడు
ఎవరు ఏది చెప్పినా విని
ముసి ముసి నవ్వులు నవ్వే ముని
గంభీరమైన విజ్ఞాన గనియైన మన అప్పుడు గారు
దాటుకుంటూ దాటుకుంటూ కులం గట్లు
విప్పుకుంటూ విప్పుకుంటూ
కనిపించీ కనిపించని కులం కట్టుబాట్లు
అష్టకష్టాలు పడి అనేక శ్రమలకోర్చి
ఆంధ్రాబ్యాంక్ లో ఎక్కారెన్నో అధికారపు మెట్లు
ఆశించే దశ నుండి శాసించే దశకు చేరుకున్నఆ శాంతమూర్తి
అంబేద్కర్ వారసులందరికి అంతులేని స్పూర్తి