నిజామాబాద్ లో
నిరుపేద కుటుంబంలో పుట్టిన
ఓ నిప్పురవ్వా ..!
ఓ నా తెలంగాణ తెలుగు బిడ్డా..!
మొన్న టర్కీలో ...
ఓ బంగారు పతకం...
సాధించిన
ఓ రాళ్ళలో రత్నమా..!
ఓ మట్టిలో మాణిక్యమా..!
నిన్న న్యూఢిల్లీలో...
జావేద్ ఇండోర్ స్టేడియంలో
కసితో కృషితో కఠోర సాధనతో
కదనరంగంలోకి సివంగిలా దూకి
64 దేశాల క్రీడాకారులతో జరిగే ప్రపంచ
మహిళా బాక్సింగ్ పోటీలో పాల్గొని
5-0 తో బలమైన వియత్నాం ప్రత్యర్ధి
గుయెన్ తి తామ్ పై పిడుగుల వర్షం
కురిపించి మట్టి కరిపించి 50 కేజీల విభాగంలో రెండోసారి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గెలిచి...
"బంగారు పతకాన్ని" సాధించి...
"లక్ష డాలర్ల ప్రైజ్ మనిని"
"మహీంద్రా కారును" సొంతం చేసుకుని
మేటి భారతీయ బాక్సర్...
మేరీ కోమ్ స్థాయికెదిగిన...
ఓ ఎవరెస్టు శిఖరమా..!
ఓ కోహినూర్ వజ్రమా..!
మొన్న నీవు బాక్సింగ్ లో
"విశ్వవిజేతగా" నిలిచిన వేళ
బహుమతి ప్రదానోత్సవంలో
టర్కీలో క్రీడా మైదానంలో నా
"జాతీయగీతం"మారుమ్రోగిపోయింది
విశ్వంలో...వినీలాకాశంలో...
నా భారతీయ "త్రివర్ణ పతాకం"
విజయగర్వంతో రెపరెలాడింది
విందులు చేసింది
విహంగమై స్వేచ్ఛగా విహరించింది
ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది
అందుకే...
ఓ మా తెలుగు తేజమా..!
ఓ మా వెలుగు కిరణమా..!
ఓ మా పసిడి పావురమా..!
ఓ మా నిజామాబాద్ నిప్పురవ్వా ..!
ఓ మా తెలంగాణ తెలుగు బిడ్డా..!
నా తల్లి భరత మాత మెడలో
మెరిసే ఓ బంగారు పచ్చల హారమా..!
నా భారత జాతికి ఖండాంతర ఖ్యాతిని
ఆర్జించిన ఓ నిఖత్ జరీనా నీ జన్మధన్యం
నిన్ను కన్నవారెంతటి అదృష్టవంతులోకదా
జయహో ...! జయహో...!
నిఖత్ జరీనా...జయహో..! జయహో..!
పసిడి పతకమందుకున్న వేళ ఆనందహేల
అందుకో...మా అభినందన మందార మాల



