Facebook Twitter
పాదాభివందనమయ్యా ! ఓ పట్టాభిరామయ్య ! జేజేలు ! మీకు ఓ జాతినేత !!

మీ ప్రతి పలుకు...తేనె లొలుకు
మీ ప్రతి ఆలోచనలో...అమృతం చిలుకు
అర్థశాస్త్రం...మీ అంగవస్త్రం
ఆర్దికపరమైన...మీ తలపులు అపురూపం
సాహిత్యం...మీ సహధర్మచారిణి సాహిత్యరంగాన మీసేవలు చిరస్మరణీయం

దేశస్వాతంత్య్రమే...
మీ "సుందర స్వప్నమట"
అహింసావాది గాంధీజీకీ
మీరే..."అంతరాత్మట"
ఆర్దిక స్వాతంత్య్రమే
మీ "అంతిమలక్ష్యమట"...
స్వాతంత్య్ర పోరాటంలో...మీ
నిస్వార్ధ సేవలు..."నిరుపమానమట"

అందుకే...
పాదాభివందనమయ్యా !
ఓ పట్టాభిరామయ్య !
జేజేలు ! మీకు ఓ జాతినేత !!

నాడు విూరు మచిలీపట్నం
మట్టి నుండి పుట్టిన...ఓ మాణిక్యం
నేడు ఆంధ్రావనికే...ఓ ఆణిముత్యం

మొన్న మీరు కన్న మీ"కలల ప్రతిరూపాలు"
నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా
విస్తరించిన..."ఆర్థిక కల్పవృక్షాలు"...
నిన్నటి మీ..."ఆశయాల ప్రతిబింబాలు"
రేపు ఆసియాఖండానికే"అమృతభాండాలు"

అందుకే...
పాదాభివందనమయ్యా !
ఓ పట్టాభిరామయ్య !
జేజేలు ! మీకు ఓ జాతినేత !!

ప్రజాసేవన్నది అరుదుగా
చిక్కే బంగారు అవకాశమట...
ఆ భాగ్యం కల్పించిన వ్యక్తే
సాక్షాత్తు భగవత్స్వరూపమట...
ఓ "మరోమహాత్మా" ! మీ జన్మ
ఈ మానవ కళ్యాణం కోసమేనట...

ఓ ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకా!
మీ ఆశయాలు మీ ఆలోచనలు
కావాలి మా అందరికి ఆదర్శం...
ఓ అమరజీవి ! ఓ ఆదర్శమూర్తీ..!
దక్కాలి దక్కాలి మీకు అఖండకీర్తి..!
అప్పుడే...కదా ఆ చిత్రపటంలో
చిరునగవులొలికే మీరు చిరంజీవులు.....
ఓ త్యాగశీలీ ! ఓ మా "ఆర్థిక దైవమా !"
మీ"స్మరణే"ప్రతిభారతీయుడికి "ఓ ప్రేరణ"

అందుకే...
పాదాభివందనమయ్యా !
ఓ పట్టాభిరామయ్య !
జేజేలు ! మీకు ఓ జాతినేత !!