Facebook Twitter
మరణంలేని మహాకవి శ్రీశ్రీ

ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ల
కాదేదీ కవితకనర్హమంటూ
ప్రపంచానికి సమిధనొక్కటి
ధారపోశానంటూ సింహనాదం
చేసిన "ప్రజాకవి" మహాకవి...శ్రీ శ్రీ

నవసమాజ నిర్మాణమే
నా ధ్యేయమన్నవాడు
దానినే దర్శించినవాడు
కవిత్వాగ్ని రగిలించినవాడు
కలగన్నవాడు కసివున్నవాడు
ప్రజలకే జీవితాన్ని అంకితం చేసిన
"అభ్యుదయకవి" మహాకవి...శ్రీశ్రీ

ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి !
నెత్తురుమండే శక్తులు నిండే
సైనికులారా ! రారండి !
నెత్తురు గుండెలను అర్పణచేస్తూ
పదండి ముందుకు పదండి
తోసుకు పదండి పైపైకి
అంటూ పౌరుషాగ్నిని
రగిలించిన"విప్లవకవి"మహాకవి...శ్రీశ్రీ

పతితులార ! ఓ భ్రష్టులార !
మీ కోసం కలం పట్టి
ఆకాశవీధిలో పయణించే
జగన్నాధ రథచక్రాలను
భూమార్గం పట్టిస్తాను
భూకంపం పుట్టిస్తానంటూ
బడుగు జీవులకు భరోసా నిచ్చిన
మరిచిపోలేని మరణంలేని
మహాకవి శ్రీశ్రీకిదే నా అక్షరనీరాజనం!