Facebook Twitter
ఆ భార్యాభర్తలు త్యాగమూర్తులే...

ఆ చీకటి రోజుల్లో....
కులరక్కసి విలయతాండవం చేసే....
మనువాద మాంత్రికులు రాజ్యమేలే...
ఆరోజుల్లో చదువు విలువను గుర్తించడం...
భార్యా భర్తలు ఏకమై ఎదురు తిరగడం...
స్త్రీలకు చదువు నిషిద్ధమన్న మతపెద్దలకు
వ్యతిరేకంగా గళం విప్పడం...
విద్య నేర్చుకోవడం పదిమందికి పంచడం...
మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టడం...

నిప్పుతో తలగోక్కోవడమే...
పులుల నోట్లో తలదూర్చడమే...
సంఘభహిష్కరణ సిద్దం కావడమే...
మూర్ఖుల మూకుమ్మడి దాడిని ఎదుర్కోవడమే...
చివరికి ఇద్దరి ప్రాణాలను ఫణంగా పెట్టడమే...

ఇన్ని ముళ్ళదారులు ముందున్నా
మొక్కవోని దైర్యంతో అన్నిటికీ తెగించి
బుసలు కొట్టే... విషం వెళ్ళగక్కే
ఆనాటి కులసర్పాలతో తలపడడం ఎంతటి సాహసం
ఎక్కడిది వారికి అంతటి ఆత్మవిశ్వాసం...ఆ గుండెబలం
ఎవరి నుండి ఏ వైపునుండి ఏ ఆర్థిక సహకారం
అందకున్నా 50 పాఠశాలల్ని స్థాపించడానికి....
ఇన్నిబృహత్తర కార్యక్రమాలు నిర్వహించడానికి....

మహాత్మా జ్యోతిరావు పూలే ....
సహధర్మచారిణి శ్రీమతి సావిత్రి పూలే....
పడిన బాధలు ఎన్నో...
ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో...
అనుభవించిన అవమానాలెన్నో...
వారికి తగిలిన ఎదురుదెబ్బలు ఎన్నో ఎన్నెన్నో...

ఇకనైనా
ఈతరం యువత నిద్రమత్తువదిలి నిజం తెలుసుకోవాలి...
రాత్రింబవళ్ళు శ్రమించాలి ...

రక్తాన్ని చిందించాలి....రాజ్యాధికారాన్ని అందించాలి...

ఆ త్యాగమూర్తులకు...
ఆ కరుణామయిలకు...
ఆ చైతన్య జ్యోతులకు...
ఆ సాహసవీరులకు...
ఆ సామాజికవేత్తలకు...
ఆ ఆపద్భాందవులకు...
ఆ ఆదర్శ దంపతులకు...
ఆ మానవతావాదులకు...
ఆ సంఘం సంస్కర్తలకు...
శతసహస్ర ప్రణామాలర్పించి
వారి అడుగుజాడల్లో నడిచి
వారి ఉన్నతమైన ఆశయాలకు
మన జీవితాలనంకితం చేయడమే
వారిని కులదైవాలుగా పూజించడమే 
ప్రతినిత్యం వారిని మదిలో స్మరించుకోవడమే
ఆత్యాగమూర్తులకు మనమర్పించే ఘనమైన నివాళి...