గాఢనిద్రలో ఉన్న వేళ కలలు చెదిరి...
తలలు పగిలి...కాళ్లు చేతులు విరిగి...
ఒళ్లంతా గాయాలతో...ముఖమంతా
రక్తపుధారలతో భవన శిధిలాల మధ్య చిక్కి
ఆకలికి అలమటిస్తూ సజీవసమాధైపోతున్న
పాలస్తీనా...ఇజ్రాయెల్ ప్రజలకు దిక్కెవరు?
ఎవరి ఆధిపత్యం కోసం...?
ఎవరి రాజ్య విస్తరణ కోసం..?
ఎవరి రక్తదాహం తీరడం కోసం..?
ఈ రక్తపాత రాక్షస యుద్ధాలు...?
ఈ దారుణ మారణహోమాలు..?
ఈ ఘర్షణలు పగలు ప్రతీకారాలు..?
ఎవరికోసం హమాస్...ఇజ్రాయెల్ దళాల
మధ్య భయంకరమైన ఈ బాంబుదాడులు?
దొంగల పైకి కుక్కలను...
మేకల మీదికి తోడేళ్లను...
జింకల మీదికి పులులను...
శత్రుదేశాలపైకి మిత్రదేశాలను...
ఉసిగొల్పుతున్న యుద్దోన్మాదులెవరు..?
ఈ భీకర యుద్ధాలకు ఆజ్యం పోసేదెవరు ?
ఈమారణాయుధాలు సరఫరాచేసేదెవరు ?
ఈ హమాస్ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టేదెవరు ?
ఎటుచూసినా రక్తపుటేరులే...శవాల గుట్టలే
ఆగనిబాంబుదాడులే...అంతుచిక్కని ప్రశ్నలే
రక్తదాహం తీరని...రాజ్యకాంక్షతో రగిలేటి
ఈ రాక్షసమూకలు యుద్ధాలనాపేదెప్పుడు?
ఈ మతఘర్షణలు అంతమయ్యేదెప్పుడు ?
మనిషిలో మానవత్వం వికసించినప్పుడే..!
యుద్దోన్మాదులు అల్లాసాక్షిగా ప్రమాణంచేసి
జీహాద్ ముద్దు...జీవహింస వద్దు...ఈ
ఘోర నరమేధమొక నేరమనుకున్నప్పుడే.



